ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంకెంత కాలం కావాలి.. టిడ్కో ఇళ్ల జాప్యంపై కేంద్రం కన్నెర్ర - టిడ్కో ఇళ్లు తాజా వార్తలు

Union Govt Fire on AP Govt about Tidco Houses : టిడ్కో ఇళ్ల జాప్యంపై కేంద్రం కన్నెర్ర చేసింది. ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి ఇంక ఎంతకాలం కావాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. లబ్ధిదారులకు ఎప్పుడు అందిస్తారని ప్రశ్నించింది. ఈ మేరకు టిడ్కోకు వారం కిందట కేంద్రం లేఖ రాసినట్లు సమాచారం. మరోవైపు బకాయిలు విడుదల చేస్తేనే పనులు వేగంగా పూర్తి చేస్తామని గుత్తేదారు సంస్థలు స్పష్టం చేయడంతో.. నిర్మాణాలు ఎలా పూర్తి చేయాలని అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Apr 3, 2023, 9:27 AM IST

టిడ్కో ఇళ్ల జాప్యంపై కేంద్రం కన్నెర్ర

Tidco Houses Update : టిడ్కో ఇళ్లను పూర్తి చేయడానికి ఇంకెన్నాళ్లు కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం నిలదీసింది. టిడ్కోకు వారం కిందట లేఖ రాసిన కేంద్రం.. లబ్ధిదారులకు ఎప్పుడు అందిస్తారని ప్రశ్నించినట్లు సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్‌లో 50 వేలు, జూన్‌ నాటికి మరో 50 వేల గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని కేంద్రం రాసిన లేఖకు టిడ్కో అధికారులు సమాధానమిచ్చినట్లు తెలిసింది.

పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ టిడ్కో ఆధ్వర్యంలో గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 3.13 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 51 వేలు రద్దు చేసింది. మిగతా 2.62 లక్షల ఇళ్లలో మొదటి విడతగా లక్షన్నర ఇళ్లు పూర్తి చేస్తామని గతేడాది ప్రకటించింది. వాటిలో దాదాపు 80 వేల ఇళ్లు 90శాతంపైగా గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. మరో 70 వేలు 75శాతానికి పైగా పూర్తయ్యాయి. మిగిలిన వాటిని పూర్తి చేయడానికి కూడా వైసీపీ ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. ఉగాది నాటికే లక్షన్నర ఇళ్లు పూర్తి చేస్తామని చెప్పి ఆ మాటనూ తప్పింది. ఇప్పటివరకు 50 వేల గృహాలనే లబ్ధిదారులకు అందించింది. ఏప్రిల్‌లో మరో 35 వేల ఇళ్లను అందిస్తామని అధికారులు చెబుతున్నారు.

మొదటి విడతగా లక్షన్నర గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పన సహా పూర్తి చేయడానికి 1,500 కోట్ల రూపాయలు అవసరమని అధికారులు అంచనా వేసి రుణ సేకరణపై దృష్టి పెట్టారు. హడ్కో నుంచి 750 కోట్లు, కేంద్రం నుంచి స్పెషల్‌ అసిస్టెంట్‌ స్కీమ్‌ కింద 700 కోట్ల రుణం కోసం అర్థించినా ఆ సంస్థలు ముందుకు రాలేదు. 2.62 లక్షల గృహాల్ని పూర్తి చేయాలంటే దాదాపుగా 8 వేల కోట్లు అవసరమని అధికారులు నివేదించారు. లబ్ధిదారుల వాటాగా ఇప్పటివరకు బ్యాంకులు 1900 కోట్లు విడుదల చేశాయి. వాటితోనే టిడ్కో అధికారులు పనులు కొనసాగిస్తున్నారు.

మొదటి విడతగా ఎంపిక చేసిన ఇళ్లలో ఎల్‌అండ్‌టీ సంస్థ చేపట్టినవి 18 వేల ఇళ్ల వరకు ఉన్నాయి. మౌలిక సదుపాయాలు సహా 8 వేల ఇళ్లు పూర్తి చేసి టిడ్కోకు అప్పగించింది. మరో 10 వేల ఇళ్లు పూర్తి చేయాల్సి ఉంది. ఈ సంస్థకు 200 కోట్ల రూపాయల బకాయిలు ఇవ్వాలి. వైసీపీ ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఎంపిక చేసిన గుత్తేదారు సంస్థల పరిస్థితీ అలాగే ఉంది. ఈ సంస్థలకు దాదాపు 400 కోట్లు వరకు బకాయిలుండగా, రెండు నెలల క్రితమే 300 కోట్లు సీఎఫ్‌ఎమ్‌ఎస్‌లో అప్‌లోడ్‌ చేసినా ఇప్పటివరకు జమ కాలేదని తెలుస్తోంది.

మొదటి విడత చేపట్టే నిర్మాణాల్లో 25 వేల ఇళ్లు షాపూర్‌జీ పల్లోంజీ సంస్థకు ఉన్నాయి. ఇవన్నీ పూర్తయినా ఇంకా మౌలిక సదుపాయాలు కల్పించాలి. 2, 3 విడతల్లో ఉన్న 30 వేల ఇళ్ల నిర్మాణం మాత్రం చేపట్టబోమని ఆ సంస్థ టిడ్కోకు స్పష్టం చేసినట్లు తెలిసింది. మొత్తంగా గుత్తేదారు సంస్థలకు ఇప్పటికే 5 వేల కోట్లు చెల్లించామని, మరో 700 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఇదికాకుండా లబ్ధిదారులు చెల్లించాల్సిన వాటాలో 50% వరకు రాయితీ ప్రకటించిన ప్రభుత్వం.. ఇవ్వాల్సిన 140 కోట్ల రూపాయల్ని మాత్రం చెల్లించలేదని తెలుస్తోంది.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details