గ్రామీణ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్న యూజీసీ ఛైర్మన్ UGC Chairman Letter To The Governor: రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టకముందే... యూజీసీ నుంచి జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు తొలి లేఖ అందింది. రాష్ట్రంలో ఉన్నత విద్య పాఠ్యపుస్తకాలను మాతృభాషలో ప్రచురించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. పుస్తకాలు అందుబాటులో ఉంచేలా విద్యాసంస్థలకు సూచించాలని విన్నవించింది.
గవర్నర్‌కు యూజీసీ ఛైర్మన్ లేఖ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీశ్‌కుమార్ లేఖ రాశారు. భారతీయ భాషల్లో విద్యాబోధన ఉండాలన్నది జాతీయ విద్యావిధానం-2020 లక్ష్యమని లేఖలో పేర్కొన్నారు. ఈ విధానం ప్రకారం బోధనతో పాటు బోధనకు సంబంధించిన ఉపకరణాలన్నీ మాతృభాషల్లో అందుబాటులో ఉంచాలన్నారు. దేశవ్యాప్తంగా చాలా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో సోషల్ సైన్సెస్, కామర్స్, సైన్సు కోర్సులను మాతృభాషల్లో బోధిస్తున్నట్లు వివరించారు. ఈ విదానం గ్రామీణ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అందువల్ల రాష్ట్రంలో ఉన్నత విద్య పాఠ్య పుస్తకాలను మాతృభాషలో ప్రచురించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
స్థానిక భాషల్లోకి పాఠ్యపుస్తకాలు: సైన్స్, కామర్స్, వృత్తివిద్యా కోర్సుల పాఠ్యపుస్తకాలు కూడా స్థానిక భాషల్లో అందుబాటులోకి తెచ్చేలా అనువాదం ద్వారానైనా ప్రోత్సహించాలన్నారు. గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో ఇప్పుడున్న 27 శాతం నుంచి 2035 నాటికి 50 శాతానికి చేరుతుందన్నారు. దీనివల్ల ఉన్నత విద్య మరింత మందికి చేరువవుతుందని యూజీసీ ఛైర్మన్ అన్నారు. దీనికి సన్నద్ధతగా వివిధ విశ్వవిద్యాలయాల వీసీలతో యూజీసీ ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసిందన్నారు.
విద్యాసంస్థలు కీలకపాత్ర: పాఠ్యపుస్తకాల తయారీ, మాతృభాషలో బోధన, అభ్యాసం కొనసాగించేలా ఉన్నత విద్యాసంస్థలు కీలకపాత్ర పోషించాలన్నారు. ఇతర భాషల్లోని మంచి పుస్తకాలను స్థానిక భాషల్లోకి అనువదించాలని ఈ దిశగా ఏపీలోని విద్యాసంస్థలను ప్రోత్సహించాలని నూతన గవర్నర్ జస్టిస్ నజీర్‌ను యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ కోరారు. ఈ లేఖ ద్వారా మూడు సూచనలు చేశారు. స్థానిక భాషల్లో ఏయే కోర్సులకు సంబంధించి పాఠ్యపుస్తకాలు అందుబాటులో లేవో జాబితా రూపొందించమని విద్యాసంస్థలకు చెప్పాలన్నారు. పుస్తకాలు రాయగల, అనువాదం చేయగల ప్రతిభావంతులను గుర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మాతృభాషల్లో నాణ్యమైన పుస్తకాలు తయారుచేసే ప్రయత్నాలకు మద్దతివ్వాలని విన్నవించారు. అలాగే బోధన, అభ్యాసం రెండూ మాతృభాషలో సాగేలా ప్రోత్సహించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి