తగ్గిన బైక్ విక్రయాలు.. రెండేళ్లతో పోల్చుకుంటే.! Two Wheelers Sales Decreased: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి అవసరంగా ద్విచక్ర వాహనం మారింది. చిన్న చిన్న పనులు, ప్రయాణాల కోసం చిన్న నుంచి మధ్య తరగతి కుటుంబాల వరకు ప్రతి ఒక్కరూ కొనుగోలు చేస్తారు. అయితే రాష్ట్రంలోని ప్రతికూల పరిస్థితులు ద్విచక్ర వాహనాల విక్రయాలపై తీవ్ర ప్రభావం చూపెడుతున్నాయి. గడిచిన రెండు సంవత్సరాల్లో ఏపీలో ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు గణనీయంగా తగ్గినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2021-22లో 6.52 శాతం మేర విక్రయాల్లో తగ్గుదల నమోదు అయితే.. 2022-23లో ఇది 8.03 శాతంగా రికార్డు అయ్యింది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నెల నుంచి దాదాపు ప్రతీ నెలా వాహన విక్రయాల్లో తగ్గుదల నమోదు అయ్యింది. ఒక్క 2022 సెప్టెంబరు, 2023 జనవరి మాసాల్లో మినహా అన్ని నెలల్లోనూ ద్విచక్ర వాహనాలు తిరోగమనంలో ఉన్నట్లు గణాంకాల్లో వెల్లడవుతోంది. దీంతో అటు పన్ను వసూళ్లు కూడా గణనీయంగా తగ్గాయి. మొత్తం సంవత్సరంలో 6లక్షల 34వేల 256 మోటారు సైకిళ్లు, స్కూటర్లు, ఇతర వాహనాల విక్రయాలు జరిగినట్టు స్పష్టమవుతోంది.
అంతకుముందు ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా 6లక్షల 89వేల 632 ద్విచక్ర వాహనాలు అమ్ముడు పోయాయి. దీంతో గత ఏడాదితో పోలిస్తే విక్రయించిన వాహనాల్లో 8.03 శాతం తగ్గుదల నమోదు అయ్యింది. మొత్తంగా 663 కోట్ల రూపాయల పన్నులు వసూలయ్యాయి. వాస్తవానికి పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణా రాష్ట్రాల్లో ద్విచక్ర వాహన విక్రయాల్లో 31 శాతం మేర పెరుగుదల నమోదైంది. వాస్తవానికి దీపావళి, దసరా, సంక్రాంతి పండుగల సమయంలో పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు జరగాలి. 2022 సెప్టెంబరు నెలలోనూ, 2023 జనవరి నెలల్లో స్వల్పంగా విక్రయాల్లో 5 శాతం మాత్రమే వృద్ధి నమోదు అయింది. మిగతా 10 నెలలూ ద్విచక్ర వాహనాల విక్రయాల్లో తిరోగమనం రికార్డు అయ్యింది.
కనీస అవసరంగా మారిపోయిన ద్విచక్ర వాహనం కొనుగోళ్లు తగ్గటానికి కరోనా అనంతర పరిస్థితులేనని ఆయా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రజల్లో రాబడి తగ్గి కోనుగోలు శక్తి పడిపోవటం, ఇతర ప్రాంతాలకు యువత వలస వెళ్లిపోవటం లాంటి అంశాలు ద్విచక్ర వాహన కొనుగోళ్లను ప్రభావితం చేస్తున్నట్టు వెల్లడవుతోంది. దీంతో పాటు రాష్ట్రంలోని రహదారులు దుర్భరంగా ఉండటం వాటిపై ద్విచక్ర వాహనాలతో ప్రయాణించలేకపోవటం వంటి కారణాలు కూడా కొనుగోళ్లను ప్రభావితం చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్రంలో వాహనాలపై జీవిత కాలపు పన్ను 12 శాతానికి పెంచటం, పెట్రోలు ధరలు 111 రూపాయలుగా నమోదు అవ్వటం కూడా ద్విచక్ర వాహన విక్రయాలను నిరుత్సాహపరిచినట్టు స్పష్టమవుతోంది.
ఇవీ చదవండి: