Sand Illegal Transport: రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాల్లో దోపిడీ ఎలా సాగుతుందో వివరిస్తూ ఈటీవీ భారత్, ఈనాడులో ప్రచురితమైన కథనంపై గనులశాఖ ఉన్నతాధికారులు కొద్ది రోజుల క్రితం సుదీర్ఘ వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో ఇసుక విధానం అత్యంత పారదర్శకంగా ఉందని, ఎక్కడా అక్రమాలు లేవని, పొరుగు రాష్ట్రాలకు ఇసుక తరలిపోవడం లేదంటూ తెలిపారు. అయితే ఎన్టీఆర్ జిల్లా నుంచి అక్రమంగా ఇసుకను హైదరాబాద్‌కు తరలిస్తున్న 15 లారీలను తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అధికారులు పట్టుకోవడమే కాదు.. ఆరు లారీలపై కేసులు నమోదు చేశారు. ఇక వారి కళ్లుగప్పి సరిహద్దులు దాటే లారీలు ఎన్నో లెక్కేలేదు. ఇప్పుడు వీటికి గనుల శాఖ సంచాలకుడు ఏం సమాధానం చెబుతారు..।? ఏ ఆధారాలతో వార్తలను ప్రచురితం చేస్తోందని ప్రశ్నించిన వీజీ వెంకట్‌రెడ్డికి ఈ ఆధారాలు సరిపోతాయా..? తెలంగాణ పోలీసులు పెట్టిన కేసులపై ఆయన ఏం సమాధానం చెబుతారు.
వ్యూహాత్మకంగా రవాణా:NTR జిల్లా జగ్గయ్యపేట, కంచికచర్ల, చందర్లపాడు, నందిగామ మండలాల నుంచి పెద్దఎత్తున ఇసుక అక్రమ మార్గంలో తెలంగాణ సరిహద్దులు దాటుతోంది. కృష్ణానది, మున్నేరు నుంచి లారీల్లో ఇసుకను గుట్టుచప్పుడు కాకుండా తరిలించేస్తున్నారు. ఇటీవల కాలంలో తెలుగుదేశం నేతలు పలుమార్లు లారీలను సరిహద్దుల్లో అడ్డుకుని ధర్నాకు దిగిన సందర్భాలు ఉన్నాయి. గని ఆత్కూరు, కాసరాబాద్ రేవుల్లో లభించే సన్న ఇసుకకు హైదరాబాద్‌లో మంచి డిమాండ్ ఉంది. ఆయా మండలాల్లోని ఇసుక రీచ్‌ల నుంచి నిత్యం సగటున 100 లారీలకు పైనే ఇసుక తరలిపోతోంది. రాత్రి 8, 9 గంటలకు మొదలయ్యే ఈ రవాణా, తెల్లవార్లూ సాగుతోంది.
చక్రం తిప్పుతున్న సలహాదారుడి కుమారుడు: ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇసుక వ్యాపారాన్ని ఇటీవల వరకు ఓ ఎమ్మెల్యే బావమరిది నిర్వహించగా.. ఇటీవలే మరో ఎమ్మెల్యే అనుయాయుడికి ఈ వ్యాపారాన్ని అప్పగించారు. అయితే సరిహద్దు ప్రాంతాల నుంచి తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా చేసే వ్యవహారాన్ని మాత్రం ప్రభుత్వంలో కీలకంగా ఉండే ఓ సలహాదారుడి కుమారుడు చూస్తున్నట్లు తెలిసింది. ఆయా మండలాల్లోని రీచ్‌ల నుంచి బయలుదేరే లారీలను విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి మీదుగా సరిహద్దులోని గరికపాడు చెక్‌పోస్ట్ దాటించే వరకు.. ఎవరూ అడ్డుకోకుండా ఆయనే చూస్తారని ఇసుక వ్యాపారులు చెబుతున్నారు. ఆయన ఆదేశాలతో ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఎక్కడ ఇసుక లారీలను అడ్డుకునేవారు ఉండరని చెబుతున్నారు.