Indrakeeladri Shop rent Dispute: విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద చిరువ్యాపారులు ఆందోళనకు దిగారు. తమకు కేటాయించిన దుకాణాల పరిమాణం తక్కువగా ఉన్నప్పటికీ... భారీగా అద్దె వసూలుకు నోటీసులు జారీ చేశారని ఆవేదన చెందారు. దేవాదాయశాఖ మంత్రి సహా ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులకు పలుమార్లు వినతులు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదంటూ ఓ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాజా పరిణామాలపై ఆలయ అధికారులు, ఇంజనీర్లతో చర్చించి దుకాణదారుల అర్జీలపై ఓ నిర్ణయం తీసుకుంటామని పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు ప్రకటించారు. దీంతో దుకాణదారులు తమ ఆందోళనను తాత్కాలికంగా విరమించుకున్నారు.
బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రుల ఉత్సవాలు జరుగుతున్న వేళ... కనకదుర్గనగర్‌లోని దుకాణాల వద్ద ఓ కార్మికుడు ఆత్యహత్యకు యత్నించడం కలకలం రేపింది. మూడు రోజుల్లో బకాయిపడిన అద్దె మొత్తాన్ని చెల్లించాలని ఆలయ అధికారులు నోటీసులు జారీ చేయడం దుకాణదారులను కంగుతినిపించింది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ దుకణదారులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని... వ్యాపారాలు సజావుగా జరిగే ప్రదేశంలో దుకాణాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ పోస్టర్లను దుకాణాల వద్ద అతికించారు. దుకాణాల పరిమాణం పెంచాలని... అధికంగా ఉండే అద్దెలు తగ్గించాలని డిమాండ్ చేశారు. గతంలో ఘాట్ రోడ్డు వద్ద ఉండే దుకాణాలను తొలగించారని.. ఆ తర్వాత తమకు దుకాణాలు కేటాయించిన చోట వ్యాపారం సరిగా జరగడం లేదంటూ ఓ కార్మికుడు తన ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే చుట్టుపక్కల కార్మికులు అతన్ని వారించారు. ఆలయ అధికారుల వైఖరికి నిరసనగానే తాను ఆత్మహత్యాయత్నం చేయాల్సి వచ్చిందని కార్మికుడు పేర్కొన్నారు. మెరుగైన సౌకర్యాలు లేకపోయినా భారీగా అద్దె వసూలు చేస్తున్నారంటూ దుకాణ యజమానులు ఇప్పటికే దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆలయ పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు వద్ద తమ గోడు వెల్లబోసుకున్నారు.
కనకదుర్గానగర్‌లో దుకాణదారుల ఆందోళన, ఓ కార్మికుని ఆత్మహత్యాయత్న విషయం తెలిసిన వెంటనే ఆలయ పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు, ఇతర సభ్యులు దుకాణాల వద్దకు చేరుకున్నారు. పరిస్థితులను పరిశీలించారు. దుకాణదారులతో చర్చించారు.