Rahul Padayatra in Telangana: భారత్ జోడో యాత్ర పాలమూరు కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఒకప్పుడు పాలమూరులో హస్తం పార్టీ బలంగా ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన 2014 సాధారణ ఎన్నికల్లో రాష్ట్రమంతా తెరాస హవా సాగినా ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో మాత్రం కాంగ్రెస్ అయిదు ఎమ్మెల్యే, ఒక పార్లమెంటు సీట్లను సాధించింది. 2018 ఎన్నికల్లో మాత్రం కొల్లాపూర్‌లో మాత్రమే గెలిచింది. ఆ ఎమ్మెల్యే తరవాత తెరాసలో చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ స్థానాన్నీ కాంగ్రెస్ కోల్పోయింది. రాహుల్ పర్యటన పార్టీకి జవసత్వాలు కల్పిస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
ఎమ్మెల్యే ఎన్నికలకు మరో ఏడాదే సమయం.. : శాసనసభ ఎన్నికలకు మరో ఏడాదే సమయం ఉంది. ఈ నేపథ్యంలో రాహల్ పాదయాత్ర ప్రాముఖ్యతను సంతరించుకుంది. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం పరిధిలోని మక్తల్, నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్ నియోజకవర్గాల మీదుగా ఈ పాదయాత్ర కొనసాగుతుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సొంత ప్రాంతంలో ఈ యాత్ర ఉండటంతో పార్టీ శ్రేణులను భారీగా తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
పాదయాత్రలో స్థానిక నేతలకు అవకాశం కల్పించడం ద్వారా వారిలో ఉత్సాహాన్ని నింపనున్నారు. మక్తల్, దేవరకద్ర, మహబూబ్‌నగర్ నియోజకవర్గాల్లో మాజీ ప్రజాప్రతినిధులు కొందరు కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. రాహుల్‌ను వారితో మాట్లాడించేలా స్థానిక నేతలు ప్రయత్నిస్తున్నారు.
యువత, రైతులు, మహిళలే లక్ష్యంగా: రాహుల్ పాదయాత్ర ప్రధానంగా యువత, రైతులు, మహిళలే లక్ష్యంగా సాగుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. స్థానిక రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటారని, పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇచ్చి భరోసాను కల్పిస్తారని పేర్కొంటున్నారు. పాలమూరు విశ్వవిద్యాలయ విద్యార్థులతో రాహుల్ భేటీ అయ్యేలా చూడాలన్న ఆలోచన కూడా నాయకుల్లో ఉంది. మహిళల సమస్యలనూ యాత్రలో ప్రస్తావిస్తారని నేతలు చెబుతున్నారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రముఖులు కూడా రాహుల్‌ను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఘన స్వాగతానికి ఏర్పాట్లు:భారత్ జోడో యాత్రకు ఘన స్వాగతం పలకడానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం మారుతినగర్ వద్ద ఉన్న వంతెన ద్వారా యాత్ర కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. రాష్ట్రానికి చెందిన ఏఐసీసీ, పీసీసీ నేతలు, డీసీసీ అధ్యక్షులు ఆయనకు స్వాగతం పలకనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి టైరోడ్డు వరకు కిలోమీటర్ మేర రాహుల్ పాదయాత్ర నిర్వహించనున్నారు.