Agitation on Name Change of NTR University: ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై టీఎన్టీయుసీ, తెదేపా నేతలు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు ఎన్టీఆర్ యూనివర్సిటీ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ పేరు మార్చే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ముందుగా కార్యకర్తలు వర్సిటీ ప్రధాన గేట్ల ముందు ఆందోళన చేపట్టారు. వర్సిటీ ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి కార్యకర్తలు పాలాభిషేకం చేశారు.
కార్యకర్తలు యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేయగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. అక్కడనుంచి గన్నవరం ప్రధాన రహదారిపైకి వచ్చిన కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో... అక్కడ ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీ పేరు మార్చటం ప్రభుత్వ నిరంకుశ చర్య అని కార్యకర్తలు ఆరోపించారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొకుంటే భవిష్యత్లో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడనుంచి తరలించారు.
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపుపై ఉత్తరాంధ్ర మెుదలుకుని రాయలసీమ వరకూ ప్రతి జిల్లాలో తెదేపా శ్రేణులు నిరసనకు దిగాయి. ఎన్టీఆర్ వర్సిటీ పేరును యథావిథిగా కొనసాగించాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ప్రకాశం జిల్లా..కనిగిరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కనిగిరి తెదేపా ఇన్చార్జ్ ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఆలోచనతో 36 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయానికి ఇప్పటికిప్పుడు హడావిడిగా ఎన్టీఆర్ పేరును తొలగించి.. వైయస్సార్ పేరు పెట్టడం అర్ధరహితమని.. ఈ పిచ్చి జగన్ ప్రభుత్వం మూడున్నరేళ్లలో కొత్తగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టకపోగా.. ఉన్న వాటికే పార్టీ రంగులు వేసి పేర్లు మార్చి.. వాటికి స్టిక్కర్లు వేస్తూ స్టిక్కర్ల ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి మిగిలిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. యర్రగొండపాలెంలో తెదేపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. స్థానికంగా గల ఎన్టీఆర్ విగ్రహానికి క్షిరాబిషేకం చేసి, పులమాలలు వేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని నినాదాలు చేశారు
నంద్యాల జిల్లా.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీ రామారావు పేరు మార్పు చేయడంపై జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పరిపాలన చేతకాకే పేర్లు మార్పిడి చేస్తున్నారన్నారు. వెయ్యి రూపాయలు దాటిన వారికి ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్యం చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఆసుపత్రుల్లో ఎందుకు వసతులు కల్పించడం లేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు మార్పు ఏమాత్రం తగదని నంద్యాలలో తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా అఖిల ప్రియ తెలిపారు. వైకాపా ప్రభుత్వ నీచ రాజకీయాలకు ఇది నిదర్శనం అన్నారు. ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలని అఖిల డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లాఎన్టీఆర్ హెల్త్ యునివర్శిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడం సరికాదని జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఎన్టీరామారావు పేరు తొలగించి వైఎస్సార్ పేరు పెట్టడాన్ని తెలుగు దేశం పార్టీ వ్యతిరేకిస్తూ జిల్లా తెదేపా కార్యాలయం ముందు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పరిపాలన చేతకాక పేర్లు మార్పు చేస్తున్నారని ఆయన విమర్శించారు. గోనెగండ్లలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తొలగించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పెట్టడంపై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
నెల్లూరులో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆందోళన చేపట్టింది. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిరసన తెలియజేసిన పార్టీ నేతలు, ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరుపుకుంటున్న సమయంలో వర్సిటీ పేరు మార్చడం దుర్మార్గమని తేదేపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వై.ఎస్.ఆర్.హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడం చాలా బాధాకారమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఆక్షేపించారు. గడిచిన మూడున్నరేళ్లలో ఎన్నో దురదృష్టకర నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి... ఇవాళ ఎన్టీఆర్ పేరు మార్చడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరుమార్చి వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని ముఖ్యమంత్రి సొంతజిల్లాలో తెలుగుదేశం శ్రేణులు తీవ్రంగా తప్పుబట్టారు. కడప, కమలాపురం, రాయచోటి తదితర ప్రాంతాల్లో తెదేపా నాయకులు ఆందోళనలు చేపట్టారు.