ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉప్పల్​ మ్యాచ్​కు పోలీసుల భారీ బందోబస్తు

police security for today ind vs nz match: తెలంగాణలోని ఉప్పల్‌ స్టేడియంలో జరగబోయే భారత్‌-న్యూజిలాండ్‌ వన్డే మ్యాచ్‌పై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. మ్యాచ్‌ చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియంకు రానున్న నేపథ్యంలో ఈసారి రెండున్నర వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మహిళల భద్రత దృష్ట్యా షీ టీమ్స్‌ పనిచేయనున్నాయి. అలాగే మ్యాచ్‌ సమయంలో అదనంగా మెట్రో రైళ్లు కూడా నడపనున్నారు.

By

Published : Jan 18, 2023, 11:19 AM IST

cricket match
ఉప్పల్‌ స్టేడియం

ind vs nz ODI match hyderabad: దాదాపు నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్‌లో వన్డే మ్యాచ్‌ జరగనుంది. రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఇరుజట్ల సభ్యులు హైదరాబాద్‌ చేరుకుని మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కూడా చేశాయి. మరోవైపు అధికారులు రెండున్నర వేల మందికి పైగా పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. రాచకొండ కమిషనరేట్‌తో పాటు వివిధ జిల్లాల నుంచి కూడా బలగాలు విధులు నిర్వర్తించనున్నాయి.

మహిళల భద్రతకు షీ టీమ్స్‌ పనిచేయనున్నాయి. మ్యాచ్ మధ్యాహ్నం 1:30 నిమిషాలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో 12 గంటల నుంచి ప్రేక్షకులను స్టేడియం లోపలికి అనుమతించనున్నారు. కీలక ప్రాంతాల్లో క్విక్‌ యాక్షన్‌ బృందాలు అందుబాటులో ఉంచామని... ఎలాంటి పరిస్థితులైనా చక్కదిద్దేందుకు రెండు ఆక్టోపస్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయని రాచకొండ సీపీ చౌహన్‌ తెలిపారు. అలాగే పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లిస్తామని.... ఎవరైనా బ్లాక్‌లో టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Uppal Match Security: గతంలో స్టేడియం వద్ద ప్రేక్షకులకు జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకులు ప్రవేశించేందుకు 12 వ గేట్‌ను కూడా పోలీసులు వినియోగంలోకి తీసుకొచ్చారు. ఇంతకుముందు 11 గేట్లు అందుబాటులో ఉండగా ప్రేక్షకులకు ఇబ్బందులు తలెత్తకుండా 12వ గేట్‌ను అందుబాటులోకి తెచ్చారు. మ్యాచ్‌ 50 ఓవర్లు కాబట్టి ప్రేక్షకులు విడతల వారిగా వస్తారని...ఫలితం దగ్గర పడే కోద్దీ వారి సంఖ్య కూడా పెరగుతుందని అందుకు తగ్గ భద్రత ఏర్పాట్లు చేసినట్లు మల్కాజ్‌గిరి డీసీపీ రక్షితా మూర్తి తెలిపారు.

గేట్‌ నెంబర్‌ ఒకటి సీఎం, గవర్నర్‌, బీసీసీఐ సిబ్బందికి మాత్రమేనని ప్రవేశం ఉంటుంది. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఎవరైన మైదానం లోపలికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు ట్రాఫిక్‌ పోలీసులు వాహనాదారులకు పలు సూచనలు చేశారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు సోమాజీగూడ, బేగంపేట, మెట్టుగూడ, తార్నక, హబ్సిగూడ తదితర ప్రాంతాల్లో రద్దీ ఉంటుందని... ఆయా సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు.

మరోవైపు మ్యాచ్‌ దృష్ట్యా మెట్రో సేవలను కూడా పెంచారు. నాగోల్ -రాయదుర్గం రూట్‌లో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రతి 5 నిమిషాలకు ఓ మెట్రో రైలు ప్రజలకు అందుబాటులో ఉండనుంది. మళ్ళీ సాయంత్రం 4 నుంచి రాత్రి 10 వరకు ప్రతి 4 నిమిషాలకు ఓ మెట్రోరైలు ఉంటుందని హెచ్​ఎమ్​ఆర్​ఎల్​ ప్రకటించింది. టికెట్ల కోసం నాగోల్‌, ఉప్పల్‌, ఎన్​జీఆర్​ఐ మెట్రో స్టేషన్లలో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు.

ఇవీ చేయండి:

ABOUT THE AUTHOR

...view details