Dogs rampage: విజయవాడలోని భవానీపురంలో కుక్కల స్వైరవిహారం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. హైదరాబాద్లో కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటన మరువక ముందే.. విజయవాడలో ఒక్కరోజే కుక్కలు ముగ్గురు చిన్నారులపై దాడి చేశాయి. హైదరాబాద్లో ప్రమాదం జరిగినప్పుడైనా విజయవాడలో అధికారులు మేల్కొని ఉంటే ముగ్గురు చిన్నారులు ఇప్పుడు బాధితులుగా మారేవారు కాదని పలువురు వాపోతున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇకనైనా స్పందించి కుక్కలను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు.
స్పందించని అధికారులు..: భవానీపురంలో పిచ్చికుక్కల దాడిలో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. కుక్కల సమస్య తీవ్రంగా ఉందని ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి సరైన స్పందన లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కల వల్ల పిల్లలకు ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.
బయటకు రావాలంటేనే భయం..: భవానీపురం మసీదు వీధిలో ఒకేరోజు ముగ్గురు పిల్లలపై పిచ్చికుక్కల దాడి చేయడం నగరంలో కలకలం సృష్టించింది. కుక్కల దాడిలో నజీర్, చైతన్య, జెస్సికా అనే చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. తమ ప్రాంతాల్లో పిచ్చి కుక్కల సంచారం విపరీతంగా పెరిగిందని, కుక్కలను పట్టుకోవాలని తాము అధికారులకు ఫిర్యాదు చేసినా.. సరైన స్పందన లేదని భవానీపురం వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిచ్చికుక్కలు పెరిగిపోవడంతో బయటకు రావాలంటేనే భయంగా ఉందని వారు ఆందోళన చెందుతున్నారు.
కాపాడేవారిపైనా దాడి..: స్కూల్ నుంచి వస్తున్న సమయంలో ఒక్క కుక్క తనపై దాడికి దిగిందని బాధితుడు నజీర్ వాపోయాడు. చేతులు, కాళ్లపై విచక్షణారహితంగా దాడి చేసిందన్నాడు. తనను కాపాడేందుకు వచ్చిన వారిపై కూడా.. కుక్క దాడికి పాల్పడిందని, కిరాణ షాపు వద్ద ఉన్న వారు వచ్చి కుక్కను కొట్టడంతో వెళ్లిపోయిందని.. లేకపోతే తనను చంపేసేదని అవేదన చెందుతున్నాడు.