Valentines Day Special: సినిమాల్లో, మీమ్స్‌లో చూపినట్లు హోటళ్లలో తినిపించాలని, బ్యూటీ పార్లర్ల ఖర్చు భరించాలని, డ్రెస్సులూ యాక్ససరీసులు కొనివ్వాలనీ కోరుకోరు. అతను తనకోసం సమయం వెచ్చించాలనుకుంటారు.
- ప్రేమికుడితో కలిసి సినిమాలకూ షికార్లకూ వెళ్లాలనుకునే మాట నిజమే. అది కలిసి సమయం గడపాలన్న తపనే తప్ప ఖర్చుపెట్టించాలని కాదు. నిజానికి ఇద్దరూ బయటకు వెళ్లినప్పుడు ఆడపిల్లలే ఎక్కువ ఖర్చుపెడుతున్నట్లు ఎన్నో సర్వేల్లో తేలింది.
- ఆయా సందర్భాల్లో మెహర్బానీ కోసం కానుకలు ఇవ్వబోతే వాటితో పనేలేదు, సరదాగా కాసేపు కబుర్లు చెబితే చాలనే అమ్మాయిలే అధికశాతం ఉన్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.
- బాగా చదువుకుని, మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన అమ్మాయిలు కూడా ప్రేమికుడు లేదా భర్త దగ్గరకు వచ్చేసరికి చిన్నపిల్లలైపోతారు. తమను కాస్త గారాబం చేస్తూ ముద్దుముచ్చట్లాడితే మురిసిపోతారు. అతడి కోసమే ఆమె అందంగా సింగారించుకుంటుందని అర్థంచేసుకుని ‘ఈ డ్రెస్సులో భలే ఉన్నావు.. ఈ హెయిర్‌స్టయిల్ నీకు బాగా నప్పింది’ లాంటివి చెబితే పొంగిపోతారు. అయితే ఆ ప్రశంస పైపై మెచ్చుకోలుగా కాకుండా మనసులోంచి వస్తోందో లేదో గ్రహిస్తాయి వారి కళ్లు.
- అమ్మాయికి లేటెస్ట్ మోడల్ సెల్‌ఫోన్ కొనిస్తే ఐసైపోతుంది అనుకుంటే పొరపాటే. ప్రేమతో ఇచ్చే కానుక చిన్నదైనా అమూల్యంగా దాచుకుంటుంది! అంతకంటే ముఖ్యంగా తన అభిప్రాయాలను అతడు గౌరవించాలని కోరుకుంటుంది.
- తన అంతరంగాన్ని గ్రహించగలిగే అబ్బాయే ఆమెకి రారాజు. చిన్న దెబ్బ తగిలినా లేదా ఏ విషయంలోనైనా కలత చెందుతున్నా ఆరా తీసి ఓదార్పు నివ్వాలనుకుంటుంది. అతడి సమక్షంలో దిగులంతా మర్చిపోయి హాయిగా ఉండాలనుకుంటుంది.
- అన్నిటినీ మించి ఆడపిల్లలు తామున్నట్టే అతడూ నిజాయతీగా ఉండాలనుకుంటారు. తనతో ఉంటూనే ఇంకో అమ్మాయికి చేరువవ్వాలనుకుంటే ఇష్టపడరు. అది పొసెసివ్‌నెస్ అంటూ హేళన చేసేవాళ్లని నిక్కచ్చిగా దూరం పెట్టేస్తారు.