AB Venkateshwara Rao : ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం మాజీ అధిపతి, సీనియర్ ఐపీయస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావును డిస్మిస్ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను.. కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించడానికి, తప్పనిసరిగా పదవీ విరమణ చేయించడానికి వీల్లేదని స్పష్టంచేసింది. పెనాల్టీగా 2024 మే 31వ తేదీ వరకూ రెండు ఇంక్రిమెంట్లు నిలిపేయాలని సూచించింది. ఈ చర్య తీసుకున్న తర్వాత.. ఆ విషయాన్ని తమకు తెలియజేయాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అండర్ సెక్రటరీ సంజీవ్‌కుమార్.. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డికి జనవరి 10న లేఖ రాయగా.. మంగళవారం వెలుగుచూసింది. భద్రత, నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ వెంకటేశ్వరరావుపై అభియోగాలు మోపిన రాష్ట్ర ప్రభుత్వం.. ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలంటూ 2021 డిసెంబర్ 16న కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ పరిస్థితుల్లో ఏబీవీకి ఏమేరకు పెనాల్టీ విధించాలో సూచించాలని.. గతేడాది ఫిబ్రవరిలో కేంద్ర హోంశాఖ యూపీఎస్సీని కోరింది. రెండు ఇంక్రిమెంట్లు నిలిపేయాలని యూపీఎస్సీ సిఫార్సు చేసింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఏపీ సీఎస్‌కు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది.
ఏబీవీని డిస్మిస్ చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన కేంద్రం - andhra pradesh news
ABV : ఏబీ వెంకటేశ్వర రావును డిస్మిస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోం శాఖకు గతంలో లేఖ రాసింది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తాజాగా తిరస్కరించింది. ఈ మేరకు కేంద్ర హెంశాఖ అండర్ సెక్రటరీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.
ఇదీ జరిగింది :ఆంధ్రప్రదేశ్మాజీ నిఘా విభాగాధిపతి ఏబీ వెంకటేశ్వరరావుపై రాష్ట్ర ప్రభుత్వం గతంలో చర్యలకు ఉపక్రమించింది. నిఘా పరికరాల కొనుగోలులో కుమారుడికి లబ్ధి కలిగేలా వ్యవహరించారంటూ 2020 ఫిబ్రవరి 8న ఏబీవీని సస్పెండ్ చేసి ప్రభుత్వం దాన్ని పొడిగిస్తూ వచ్చింది. 2021 సంవత్సరం ఫిబ్రవరి 2 నుంచి 180 రోజుల పాటు ఆయన సస్పెన్షన్‌ను కొనసాగించాలని అంతకముందే ఉత్తర్వులు ఇచ్చింది. ఆ కాలపరిమితి ముగియడంతో మరికొంత కాలం పొడిగిస్తూ రహస్య ఉత్తర్వులు జారీచేసింది. ఏబీవీని సర్వీసు నుంచే తొలగించాలంటూ కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. 2021 సంవత్సరంలో జులై 23వ తేదీన ఈ ప్రతిపాదనలను పంపించింది. ఏరోస్టాట్, యూఏవీల కొనుగోలు కాంట్రాక్టు తన కుమారుడి కంపెనీకి దక్కేలా వెంకటేశ్వరరావు కమిటీ సభ్యులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని లేఖలో ప్రభుత్వం ఆరోపించింది. ఆ పరికరాల నాణ్యత, సాంకేతిక సామర్థ్యం, గ్యారంటీ, వారంటీ తదితర అంశాలతో పాటు కొనుగోలు నియమావళి పాటింపు అంశాల్లో ఏబీవీ రాజీపడ్డారని కేంద్రానికి అప్పుడు రాసిన లేఖలో ప్రభుత్వం వెల్లడించింది.
ఇవీ చదవండి :