ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిధుల మళ్లింపు "పంచాయితీ".. తిరుపతి నుంచి చలో దిల్లీకి కార్యచరణ.. !

Ready For The Movement Of Sarpanch: రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడి.. దారి మళ్లించిన ఆర్థిక సంఘం నిధుల్ని సాధించి తీరుతామని సర్పంచులు స్పష్టం చేశారు. తిరుపతి నుంచి దిల్లీ దాకా ఆందోళనలు ఉధృతం చేయాలని విజయవాడలో జరిగిన 2రోజుల కార్యశాలలో నిర్ణయించారు. పంచాయితీలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన 6వేల కోట్ల రూపాయల విద్యుత్తు ఛార్జీల బకాయిల్ని రద్దు చేయాలని ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర కమిటీ సమావేశం డిమాండ్‌ చేసింది.

Chalo Delhi event in February
ఫిబ్రవరిలో చలో దిల్లీ కార్యక్రమం

By

Published : Nov 20, 2022, 10:02 AM IST

Updated : Nov 20, 2022, 12:29 PM IST

Ready For The Movement Of Sarpanch:రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిన 8 వేల 660 కోట్ల ఆర్థిక సంఘం నిధుల్ని తిరిగి పంచాయతీల ఖాతాలకు జమ చేసే దాకా తిరుపతి నుంచి దిల్లీ వరకు ఆందోళనలు చేపట్టాలని పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్ణయించింది. విజయవాడలో జరిగిన 2రోజుల సమావేశాల్లో 12 తీర్మానాలను కమిటీ ఆమోదించింది. మళ్లించిన నిధుల్ని పంచాయతీలకు వెనక్కి ఇచ్చేలా సీఎం జగన్‌ మనసు మార్చాలని వేంకటేశ్వరస్వామిని కోరుతూ నెలాఖరులో తిరుపతి నుంచి తిరుమల కొండపైకి కాలి నడకన వెళ్లాలని నిర్ణయించారు.

సర్పంచుల సమస్యలపై చర్చించేందుకు డిసెంబరులో అన్ని రాజకీయ పక్షాలతో కలిసి విజయవాడలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు. సీఎం జగన్‌తోపాటు ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన నేత పవన్‌ కల్యాణ్, సీపీఎం, సీపీఐ, ఇతర పార్టీల నేతలను సమావేశానికి ఆహ్వానించాలని నిర్ణయించారు. చలో దిల్లీ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించి.. ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు విషయాన్ని రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

మైనర్‌ పంచాయతీలకు తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా విద్యుత్తు సరఫరా చేయాలని సమావేశంలో తీర్మానించారు. గ్రామ సచివాలయాలతోపాటు వాలంటీర్లను పంచాయతీల పరిధిలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సిబ్బంది విధులు, నిధులు, అభివృద్ధి కార్యక్రమాలపై పర్యవేక్షణాధికారాల్ని సర్పంచులకు అప్పగించాలని తీర్మానించారు.

సర్పంచి, ఎంపీటీసీలకు 15వేలు, ఎంపీపీ, జడ్పీటీసీలకు 30వేలు, జడ్పీ ఛైర్మన్‌కు 2లక్షల గౌరవ వేతనం పెంచాలనే డిమాండ్ ను ప్రభుత్వం ముందు ఉండాలని నిర్ణయించారు. రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలిగా విశాఖ జిల్లా గంభీరం గ్రామ సర్పంచి వానపల్లి లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమెకు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ నియామక పత్రాన్ని అందించారు. ఉపాధి హామీ పథకం పనులను, నిధులను మళ్లీ గ్రామ పంచాయితీల ఆధీనంలోకి తీసుకురావాలని సర్పంచ్‌లు తీర్మానించారు.

ఫిబ్రవరిలో చలో దిల్లీ కార్యక్రమం

ఇవీ చదవండి:

Last Updated : Nov 20, 2022, 12:29 PM IST

ABOUT THE AUTHOR

...view details