RSS Book Launch: 'రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రణాళిక - 21వ శతాబ్ధం కోసం' అనే పుస్తకాన్ని విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆవిష్కరించారు. ఎమ్మెస్కో ముద్రణలోని ఈ పుస్తకాన్ని ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ రచించారు. ఈ పుస్తకాన్ని తెలుగులో బీరం వెంకటేశ్వర రెడ్డి అనువదించగా.. ఎమ్మెస్కో ముద్రించింది.
పుస్తక రచయిత సునీల్ అంబేకర్‌తో పాటు ఆర్‌ఎస్‌ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచార ప్రముఖ్ బయ్యా వాసు, రాష్ట్ర ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం తదితరులు.. తెలుగు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై కొందరు కల్పించిన అభూత కల్పనలు, అపోహలను ఈ పుస్తకం తొలగిస్తుందని ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు.
దేశం కోసం ఆర్ఎస్ఎస్ చేసింది ఏంటి.. ఇటువంటి భావజాలం ఉన్నవారు ఏం చేశారు. ఇలా అనేక ప్రశ్నలు ఈ పుస్తకం తెలియజేస్తుందని అన్నారు. ఆర్ఎస్ఎస్ గురించి.. ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా సరే ఈ పుస్తకాన్ని చదివి, తరువాత బయట అలా ఉన్నారా లేదా అని పరిశీలించవచ్చని తెలిపారు. 21 శతాబ్ధంలో ఎటువంటి హక్కులు కావాలి.. ఎలా పోరాడాలి ఇలాంటి అనేక విషయాలు తెలుస్తాయని అన్నారు.