AP High Court On CID Petition : సీమెన్స్ సంస్థ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్‌ను జ్యుడీషియల్ రిమాండ్‌కు ఇచ్చేందుకు నిరాకరిస్తూ విజయవాడ మూడో అదనపు జిల్లా కోర్టు (అనిశా కేసుల ప్రత్యేక న్యాయస్థానం) ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఆ ఉత్తర్వుల కారణంగా దర్యాప్తుపై ప్రభావం పడుతుందని తెలిపింది. రిమాండ్ తిరస్కరణను సవాలు చేస్తూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ను అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ భానుమతి ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ సీమెన్స్‌తో చేసుకున్న ఒప్పందంలో అవకతవకలు, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలతో సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది.
భాస్కర్‌ను 35వ నిందితునిగా పేర్కొంటూ అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం ఈ నెల 9న విజయవాడ కోర్టులో హాజరు పరిచారు. రిమాండ్ విధించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. సీఆర్‌పీసీ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలంది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ మంగళగిరి సీఐడీ డీఎస్పీ హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. తీవ్రమైన నేరాల విషయంలోనూ నిందితులకు సీఆర్‌పీసీ 41ఏ నోటీసు ఇచ్చి విచారించాలని మెజిస్ట్రేట్లు రిమాండ్ తిరస్కరిస్తున్నారన్నారు. నిందితులను వదిలేసి, 41ఏ నోటీసు ఇవ్వాలని యాంత్రిక ధోరణిలో ఆదేశాలిస్తున్నారన్నారు. రిమాండ్ దశలో మినీ ట్రైల్ (స్వల్ప విచారణ) చేయద్దంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు.