30 Percent Of Tax Increased On Vehicles In AP : దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మన వద్దే డీజిల్ ధరలు అత్యధికంగా ఉండటంతో గగ్గోలు పెడుతున్న సరుకు, ప్రయాణికుల రవాణా వాహనదారులకు ప్రభుత్వం పన్ను పెంపు రూపంలో మరో షాక్ ఇచ్చింది. త్రైమాసిక పన్ను 25 నుంచి 30 శాతం వరకు పెంచుతూ సోమవారం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. దీనివల్ల రవాణా వాహనదారులపై ఏటా 250 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. త్రైమాసిక పన్ను పెంపునకు సంబంధించి జనవరి 11న ప్రాథమిక నోఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం, సూచనలు, సలహాలు, అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరింది.
ఇప్పటికే పొరుగు రాష్ట్రాల వాహనాలతో పోటీ పడలేకపోతున్నామని, త్రైమాసిక పన్ను పెంచి మరింత భారం వేయొద్దంటూ లారీల యజమానుల సంఘాలు, ఇతర సంఘాలు.. మంత్రులు, ఉన్నతాధికారులకు పదే పదే మొరపెట్టుకున్నారు. ఐనా సరే ప్రభుత్వం ఏమాత్రం కరుణించలేదు. జనవరిలో ఇచ్చిన ప్రాథమిక నోటిఫికేషన్‌లో ఎటువంటి మార్పులు లేకుండా తుది నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రవాణా వాహనదారుల నడ్డివిరిచినట్లు అయింది. రవాణా శాఖకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 4,294 కోట్లు రాబడి రాగా, అందులో రవాణా వాహనాల నుంచి త్రైమాసిక పన్ను రూపంలో 973 కోట్లు వచ్చింది. తాజా పెంపుతో ఈ శాఖ రాబడి మరో 250 కోట్లకు పైగా పెరగనుంది.
ప్రతి త్రైమాసికానికి ఆరు టైర్ల లారీలపై 850, పది టైర్ల లారీపై 1,810, పన్నెండు టైర్ల లారీపై 2,390, పద్నాలుగు టైర్ల లారీపై 2,950, పదహారు టైర్ల లారీపై 3,610 రూపాయల చొప్పున భారం వేశారు. 12 నుంచి 15 టన్నుల సామర్థ్యముండే లారీలకు 2,967.30 రూపాయల త్రైమాసిక పన్ను ఉండేది. అంతకంటే అదనంగా ఉంటే ప్రతి 250 కేజీలకు 69.30 రూపాయల చొప్పున పన్ను వసూలు చేసేవారు. తాజా పెంపుతో 12 నుంచి 15 టన్నుల వరకు పన్ను 3,710 రూపాయలకి చేరింది. అటుపై ప్రతి 250 కేజీలకు 90 రూపాయల చొప్పున పెంచారు.