Minister Buggana Live Cut : రాజధాని అంశం ప్రభుత్వాన్ని వెంటాడుతునే ఉంది. ఈ అంశంపై ఇప్పటికే అనేక గందరగోళ ప్రకటనలు వెలువడటం.. తాజాగా బుగ్గన ఏపీకీ విశాఖే ఏకైక రాజధాని అనటంతో పెద్ద దుమారమే చెలరేగింది. ముఖ్యంగా రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న జీఐఎస్ రోడ్ షోలో రాజధానిపై పారిశ్రామికవేత్తలు పదే పదే ప్రశ్నిస్తుండటం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది.
మార్చి 3, 4 న జరుగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ప్రచారంలో భాగంగా పరిశ్రమల శాఖ ఇవాళ చెన్నైలో రోడ్ షో నిర్వహిస్తోంది. అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ పేరిట చెన్నైలో ఈ రోడ్ షోను నిర్వహిస్తున్నారు. ఈ రోడ్ షోకు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన, పరిశ్రమల శాఖ అధికారులు, ఏపీ మారిటైమ్ బోర్డు ప్రతినిధులు హాజరయ్యారు. పోర్టులు, పోర్టు ఆధారిత పరిశ్రమలు, పారిశ్రామిక కారిడార్ ల నిర్మాణం, ఇతర మౌలిక వసతులు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, భూ లభ్యత గురించి అధికారులు వివరించారు. ఏపీ ప్రస్తుతం పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని ఏపీ మారిటైమ్ బోర్డు వివరించింది. ఏపీలో 3 పోర్టులను ప్రభుత్వ రంగంలో, మరో పోర్టును ప్రైవేటు రంగంలో నిర్మిస్తున్నట్టు తెలిపారు. తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో ఏపీ ఆక్వారంగంలోనే కీలక పాత్ర పోషించబోతోందని ఏపీ మారిటైమ్ వెల్లడించింది.
బెంగుళూరు సదస్సులో పారిశ్రామికవేత్తల ప్రశ్నోత్తరాలను దృష్టిలో ఉంచుకుని తాజాగా.. చెన్నైలో నిర్వహిస్తున్న సదస్సు లైవ్ లింక్‌ను ప్రభుత్వం కట్ చేసింది. బుగ్గన ప్రసంగం ముగిసేంత వరకు కొనసాగిన ప్రత్యక్షప్రసారం.. ప్రశ్నలు-సమాధాన సమయంలో నిలిపివేసింది. పెట్టుబడిదారులు, మీడియా వర్గాల నంచి రాజధాని ఆంశంపై ప్రశ్నలు ఉండే అవకాశం ఉందని లైవ్‌ను నిలిపివేశారు.