CID raids at margadharsi offices: హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించింది. బలవంతపు చర్యలొద్దంటూ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను విస్మరించి.. మార్గదర్శి చిట్‌ఫండ్ కార్యాలయాలపై నిబంధనలకు విరుద్ధంగా చర్యలు చేపట్టింది. బ్రాంచి మేనేజర్ల వివరణలను పరిగణనలోకి తీసుకోవాలని.. ఆ తర్వాత చట్టంలోని సెక్షన్ 46(3) నిబంధనల మేరకు నిష్పాక్షికంగా వ్యవహరించాలని చిట్ రిజిస్ట్రార్లను స్పష్టంగా ఆదేశించినా.. వాటిని ఉల్లంఘించింది.
మార్గదర్శి చిట్‌ఫండ్ మేనేజర్లను సీఐడీ శనివారం ఉదయం నుంచే వారి నివాసాల్లో అదుపులోకి తీసుకొని బ్రాంచి కార్యాలయాలకు తీసుకెళ్లింది. సోదాల పేరుతో ఇబ్బందులకు గురి చేసింది. ఆయా శాఖల్లోని మహిళా సిబ్బందినీ రాత్రి వరకూ కదలకుండా కట్టడి చేసింది. నిబంధనలకు విరుద్ధంగా మధ్యరాత్రి దాటినా సోదాలను కొనసాగించింది. మార్గదర్శిపై రాష్ట్ర ప్రభుత్వం, రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల దురుద్దేశపూర్వక చర్యలను ముందుగానే గుర్తించి.. యాజమాన్యం గతేడాది డిసెంబరులోనే హైకోర్టును ఆశ్రయించింది. డిసెంబరు 26న విచారణ జరిపిన హైకోర్టు.. చిట్ రిజిస్ట్రార్లు పంపిన నోటీసుకు వివరణ ఇవ్వాలని ఆయా బ్రాంచి మేనేజర్లను ఆదేశించింది. బలవంతపు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో బ్రాంచి మేనేజర్లు వివరణ ఇచ్చినా, సీఐడీ అధికారులు కక్షసాధింపు చర్యలకు దిగారు. హైకోర్టుకు మూడు రోజులు వరుస సెలవులున్న నేపథ్యంలో శనివారం తనిఖీలకు తెరలేపారు. చట్ట నిబంధనలను పాటించాలన్న హైకోర్టు ఆదేశాలకు తిలోదకాలిచ్చారు.
ఉదయం నుంచి రాత్రి వరకూ.. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు, అనంతపురం, నరసరావుపేటల్లోని మార్గదర్శి చిట్‌ఫండ్ కార్యాలయాల్ల్లో సీఐడీ అధికారులు, సిబ్బంది శనివారం ఉదయం నుంచి తనిఖీలు చేపట్టారు. వారితోపాటు ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ మేనేజర్లను, సిబ్బందిని ప్రశ్నిస్తూనే ఉన్నారు. అనేక రికార్డులు తనిఖీ చేశారు. ఖాతాదారులను లోపలికి అనుమతించలేదు. విజయవాడ లబ్బీపేటలోని మార్గదర్శి బ్రాంచి మేనేజరు బండారు శ్రీనివాసరావును ఉదయం ఆరున్నర గంటల సమయంలోనే సీఐడీ అధికారులు ఇంటి వద్దకు వచ్చి అదుపులోకి తీసుకుని బ్రాంచి కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆయనతో పాటు కార్యాలయ అకౌంటెంట్, కంప్యూటర్ ఆపరేటరు, ఇతర సిబ్బందిని పిలిపించి, తాళాలు తీయించి విచారణ చేపట్టారు. గుంటూరు అరండల్‌పేటలోని మార్గదర్శి బ్రాంచి మేనేజర్ శివరామకృష్ణను శనివారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో ఇంటివద్ద అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి సీఐడీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో బ్రాంచి కార్యాలయానికి తీసుకెళ్లి ఫైళ్లు తనిఖీ చేశారు. ముఖ్యమైన విభాగాలకు చెందినవారిని ప్రత్యేకంగా లోపలికి పిలిచి ఒక్కొక్కరినీ విచారించారు. విశాఖ సీతంపేట మార్గదర్శి కార్యాలయంలో ఉదయం నుంచి తనిఖీలు చేపట్టారు. మేనేజర్ రామకృష్ణను, సిబ్బందిని విచారించారు. కంప్యూటర్లు, రికార్డులు పరిశీలించారు. ఫోన్లు స్విచాఫ్ చేయించి వారితో మాట్లాడారు.