Tension weather in NTR district: ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల నేషనల్ హైవేపై ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు విజయవాడ - హైదరాబాద్ నేషనల్ హైవేపైకొచ్చి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అప్రమత్తమైన నందిగామ ఏసీపీ నాగేశ్వర్ రెడ్డి.. వారి పోలీస్ బృందం ఘటనా స్థలానికి చేరుకొని కార్యకర్తలను అదుపు చేస్తుండగా పలువురు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. దాడిలో నందిగామ ట్రాఫిక్ కానిస్టేబుల్ తిరుమలరావు తలకు తీవ్రంగా గాయమైంది.
మరోవైపు విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నాకు దిగారు. పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ.. భారీ జన సమూహంతో కీసర గ్రామంలోని నేషనల్ హైవే మీద ధర్నా చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశ్వనాధ్, మహిళా నాయకురాలు జ్యోతి, ఎన్టీఆర్ జిల్లా కోటేశ్వరరావు, గుండాల ఈశ్వరయ్య, శివ నారాయణ, కత్తి ఓబులేసు, గజ్జల బాలయ్య, మారన్న, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.