Tenant Farmers Problems Due to No Identification Card :రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా కౌలు రైతులు ఉన్నారని అంచనా. వీరిలో కనీసం సగం మందికి నేటికీ ప్రభుత్వం కౌలు గుర్తింపు కార్డులు (Tenant Farmers Identification Card) ఇవ్వలేదు. దీంతో బయట అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకోలేక.. బ్యాంకు నుంచి రుణాలు పొందలేక రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి తోడు, ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు అన్నదాతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రభుత్వం గుర్తింపు కార్డులు అందించక.. బ్యాంకులు సకాలంలో రుణాలు ఇవ్వక.. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. గుర్తింపు కార్డులు ఉన్నా షరతులు విధిస్తూ రుణాల మంజూరులో జాప్యం చేస్తూ బ్యాంకులు అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని రైతులు (Tenant Farmers Problems) వాపోతున్నారు.
Identity Cards for Only 8 Lakh Tenant Farmer :రాష్ట్రంలోని కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇస్తానని, ఆర్థికంగా కౌలు రైతు కుటుంబాలను ఆదుకుంటానని సీఎం జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 8 లక్షల మందికి మాత్రమే గుర్తింపు కార్డులు మంజూరు చేసింది. అందులో కేవలం లక్షన్నర మందికి మాత్రమే రుణాలు మంజూరు చేసింది. భూయజమాని సంతకం ఉంటేనే కౌలు రైతులకు రుణాలు మంజూరు చేస్తామని చెప్పడంతో.. భూయజమానులు అనేక అపోహలు, భయాలతో సంతకాలు చేయడం లేదని కౌలు రైతులు(Tenant Farmers) వాపోతున్నారు. కౌలు రైతుల రుణాలకు భూయజమానుల సంతకం తప్పనిసరి చేయడం సరైంది కాదంటున్నారు.
No Use For Rythu Bharosa Centres in Andhra Pradesh : రైతులకు సహకారం అందించేందుకంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలు సైతం కౌలు రైతుల పాలిట శాపంగా మారాయి. కౌలు గుర్తింపు కార్డులు లేని రైతు.. పంటను అమ్ముకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పంటను అమ్ముకోలేక, పెట్టిన పెట్టుబడి రాక.. నిస్సహాయ స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల సాయంతో కౌలు రైతుల్ని గుర్తించి గుర్తింపు కార్డులు మంజూరు చేయడంతో పాటు రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కౌలు రైతు సంఘాలు, రైతులు కోరుతున్నారు.