Tenant Farmers Problems In AP : రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు ఎంతో మేలు చేసి వ్యవసాయాన్ని పండుగలా మార్చామని చేస్తోన్న ప్రకటనలు పూర్తి అవాస్తవమని, వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం నేతలు విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయశాఖ కమిషనర్, ఇతర అధికారులు కౌలు రైతులతో గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా 2019 నుంచి 17.61 లక్షల కౌలు గుర్తింపు కార్డులు ఇచ్చామని చెప్పారని, రాష్ట్రంలో 24.5 లక్షల మంది కౌలు రైతులున్నారని రాధాకృష్ణ కమిషన్ చెప్పిందని, స్వచ్ఛంద సంఘాల లెక్కల ప్రకారం 32 లక్షల మంది వరకు కౌలు రైతులు ఉన్నారని కౌలు రైతుల సంఘం నేతలు తెలిపారు.
బోగస్ సీసీఆర్సీ కార్డులే ఎక్కువ : వైఎస్సార్సీపీ ప్రభుత్వం కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వలేకపోయిందని విమర్శించారు. వారి లక్ష్యమే ఐదారు లక్షలకు మించి లేదని అన్నారు. 2022-23లో ఐదు లక్షల 96 వేల సీసీఆర్సీ కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా ఉంటే.. ఐదున్నర లక్షల మందికి ఇచ్చి ప్రభుత్వం చేతులు దులిపేసుకుందని ఆక్షేపించారు. ఇచ్చిన కార్డుల్లో కూడా బోగస్ కార్డులే ఎక్కువగా ఉన్నాయని పెదవి విరిచారు.
కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలి కలెక్టరు విచారణ : పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గంగులగుంట గ్రామంలో 333 కార్డులు ఇస్తే అందులో 280 కార్డులు, రచ్చమల్లపాడు గ్రామంలో వంద కార్డులు ఇస్తే 40 కార్డులు బోగస్ అని ఆ జిల్లా కలెక్టరు విచారణలో తేల్చారని తెలిపారు. వీరందరికీ బ్యాంకు రుణాలు, రైతు భరోసా, పంటల బీమా, నష్ట పరిహారం అందాయని.. వాస్తవంగా కౌలు రైతులకు ఏ కార్డు లేదని ఉదాహరణతో సహా వెల్లడించారు.
సకాలంలో ధాన్యం డబ్బులు ఇవ్వలేకపోయిన ప్రభుత్వం :46 నెలల్లో మూడు లక్షల మందికి రూ.529 కోట్లు రైతు భరోసా ఇచ్చామంటోందని.. ఈ ఏడాది కేవలం లక్ష మందికే భరోసా రైతు ఇచ్చారని తెలిపారు. భూమి లేని అర్హత ఉన్న ఓసీ కౌలు రైతులకు భరోసా ఇవ్వకపోవడం తీవ్ర అన్యాయమని ఆరోపించారు. 21 రోజుల్లో ధాన్యం డబ్బులు ఇస్తామని చెప్పి, 60 రోజులు దాటినా రైతులకు ప్రభుత్వం నగదు ఇవ్వలేకపోయిందని అన్నారు.
మద్దతు ధర.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం :కృష్ణా జిల్లాలో సుమారు రెండు లక్షల క్వింటాళ్ల ధాన్యం మిల్లులకు తోలిన రైతులు త్రిశంకు స్వరంలో ఉన్నారని ప్రకటించారు. పసుపుకి క్వింటాకు రూ.6,850 మద్దతు ధరగా ప్రకటించినా, మార్కెట్లో కేవలం నాలుగు వేల రూపాయలకే రైతులు విక్రయించుకోవాల్సి వస్తోందని తెలిపారు. పార్టీలతో సంబంధం లేకుండా గడప గడపకి ప్రజా ప్రతినిధులు వచ్చినప్పుడు కౌలు రైతులు ఎలా నష్టపోతున్నారో వారికి తెలియజేయాలని కౌలు రైతుల సంఘం నేతలు పిలుపునిచ్చారు. రానున్న కాలంలో ఈ సమస్యలపై గ్రామ గ్రామానికి వెళ్లి ప్రచారం చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని కౌలు రైతులు సంఘం నేతలు ప్రకటించారు.
ఇవీ చదవండి