Temperatures Raises in AP: వానలు పోయి.. ఎండలు ముదరనున్నాయ్. అవును మీరు విన్నది నిజమే.. రాష్ట్రంలో ఈరోజు సుమారు 15 మండలాల్లో వడగాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) అంచనా వేసింది. బంగాళాఖాతంలో తుఫాను ప్రభావం ఉన్నప్పటికీ.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ ఉండవచ్చని తెలిపింది. రాబోయే వారాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని APSDMA స్పష్టం చేసింది. సుమారు 2 డిగ్రీల నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.
మంగళవారం(నేడు) అల్లూరి సీతారామరాజులోని 6 మండలాలు, అనకాపల్లి, కాకినాడలో 3మండలాలు, తూర్పు గోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లోని ఒక్కో మండలంలో వేడిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం అనకాపల్లి జిల్లా కె కోటపాడులో 41.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. కసింకోటలో 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది. వడగాలుల ప్రభావంతో వృద్ధులు, పిల్లలు ఏదైనా అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని.. లేకుంటే ఇంట్లోనే ఉండాలని సూచిస్తున్నారు. ఒకవేళ వెళ్లినా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు వడదెబ్బకు గురికాకుండా ఉండాలంటే వాటర్, జ్యూస్లు, కొబ్బరి బొండాలు తాగాలంటున్నారు.