ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్రహ్మయ్య అండ్ కోలో సోదాలపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు - మార్గదర్శి చిట్‌ఫండ్‌ వార్తలు

Telangana High Court on Brahmaiah & Co: ప్రముఖ ఆడిటింగ్‌ సంస్థ బ్రహ్మయ్య అండ్ కోలో సోదాలపై యథాతథస్థితి కొనసాగించాలని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన బ్రహ్మయ్య అండ్‌ కోలో సీఐడీ సోదాలు చట్ట విరుద్ధమని వాదించింది. సోదాలు చేసే అధికార పరిధి ఏపీసీఐడీకి లేదని కోర్టుకు తెలిపింది. వాదనలు విన్న న్యాయస్థానం..తదుపరి విచారణ వరకూ యథాతథస్థితి కొనసాగించాలని ఆదేశించింది.

Telangana High Court has issued an interim order
తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ

By

Published : Mar 30, 2023, 11:00 AM IST

Updated : Mar 30, 2023, 11:17 AM IST

Telangana High Court on Brahmaiah & Co : ఆంధ్రప్రదేశ్‌లో మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సంబంధించి నమోదైన కేసులో భాగంగా ఆడిట్‌ కంపెనీ బ్రహ్మయ్య అండ్‌ కోలో ఏపీ సీఐడీ నిర్వహించిన సోదాలు, స్వాధీనం చేసుకున్న సమాచారానికి సంబంధించి తదుపరి విచారణ దాకా యథాతథస్థితిని కొనసాగించాలంటూ బుధవారం తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్‌లోని పూర్వాపరాలపై పూర్తిస్థాయిలో ఈ నెల 31న మొదటి కేసుగా విచారణ చేపడతామని తెలిపింది.

సోదాల నిమిత్తం ఈ నెల 28న ఏపీ సీఐడీ ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ.. బ్రహ్మయ్య అండ్‌ కో, భాగస్వామి పి.చంద్రమౌళి బుధవారం అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సాయంత్రం జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది బి.నళిన్‌కుమార్‌, న్యాయవాది కె.మమతాచౌదరిలు వాదనలు వినిపిస్తూ 28న ఏపీకి చెందిన సీఐడీ డీఎస్పీ రవికుమార్‌ ఎలాంటి కారణాలు లేకుండా నోటీసులు అందజేసి, వెంటనే సోదాలు చేపట్టారన్నారు. ఉద్యోగులను కదలనివ్వకుండా వారి కంప్యూటర్లలోని సమాచారాన్ని కాపీ చేసుకున్నారని తెలిపారు. తెలంగాణలోని తమ కార్యాలయంలో సోదాలు చేసే అధికార పరిధి ఏపీ సీఐడీకి లేదన్నారు.

ఈ నెల 27న సీఐడీ పంపిన మెయిల్‌ మేరకు తమ కంపెనీ భాగస్వామి కె.శ్రావణ్‌ మార్గదర్శికి చెందిన సమాచారం ఇవ్వడానికి 28న విజయవాడ సీఐడీ కార్యాలయానికి వెళ్లారన్నారు. శ్రావణ్‌తోపాటు వెళ్లిన ఉద్యోగులను సీఐడీ కార్యాలయం దాటి వెళ్లకుండా నిర్బంధించారన్నారు. 90 ఏళ్ల చరిత్ర ఉన్న ఆడిట్‌ కంపెనీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఏపీ సీఐడీ వ్యవహారం ఉందని చెప్పారు. కంపెనీ నుంచి 7 డెస్క్‌టాప్‌లు, 12 లాప్‌ట్యాప్‌లు, 2 హార్డ్‌డిస్క్‌ల్లోని సమాచారాన్ని కాపీ చేసుకున్నారన్నారు. మార్గదర్శికి చెందిన సమాచారం కాకుండా తమ ఖాతాదారులందరిదీ కాపీ చేసుకున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు వివరించారు.

ఏపీ సీఐడీ తరఫు న్యాయవాది పి.గోవిందరెడ్డి వాదనలు వినిపిస్తూ మేజిస్ట్రేట్‌ అనుమతితో సోదాలు చేపట్టి పూర్తి చేశామన్నారు. సోదాలను నిలిపివేయాలన్న పిటిషనర్ల అభ్యర్థన చెల్లుబాటు కాదన్నారు. దీనిపై పిటిషనర్‌ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ సోదాలే చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోరుతున్నామన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషన్‌కు సంబంధించి రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చుతూ నంబరు కేటాయించాలని ఆదేశించారు. తదుపరి విచారణ దాకా ‘బ్రహ్మయ్య అండ్‌ కొ’లో నిర్వహించిన సోదాలు, సేకరించిన సమాచారానికి సంబంధించి యథాతథస్థితిని కొనసాగించాలని సీఐడీని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

మరోవైపు ప్రముఖ ఆడిటింగ్‌ సంస్థ ‘బ్రహ్మయ్య అండ్‌ కొ’లో ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ పోలీసులు సోదాలు నిర్వహించారు. మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై ఆ రాష్ట్రంలో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా సోదాలు జరిపారు. మంగళవారం మధ్యాహ్నం ఎర్రమంజిల్‌లోని గోల్డెన్‌ గ్రీన్‌ అపార్ట్‌మెంట్‌లో ఉన్న ‘బ్రహ్మయ్య అండ్‌ కొ’ కార్యాలయానికి డీఎస్పీ రవికుమార్‌ ఆధ్వర్యంలో దాదాపు 30 మంది వరకు సీఐడీ పోలీసులు వెళ్లారు. వెళ్లగానే అక్కడున్న సీసీ కెమెరాలను నిలిపివేశారు.

మళ్లీ పనిచేయకుండా కేబుల్‌ కూడా కత్తిరించారని వాచ్‌మెన్‌ తెలిపారు. అనంతరం సీఐడీ సిబ్బంది నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయానికి వెళ్లారు. సంస్థలో మొత్తం 14 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో ఇద్దరు మహిళా సిబ్బందిని మాత్రం సాయంత్రం ఇంటికి పంపారు. కార్యాలయం తలుపులు మూసి సోదాలు చేపట్టారు. మంగళవారం మధ్యాహ్నం మొదలైన ఈ సోదాలు బుధవారం సాయంత్రం 5 గంటల వరకూ దాదాపు 30 గంటలపాటు కొనసాగాయి.

గత 8 సంవత్సరాలకు సంబంధించి ఆడిటింగ్‌ దస్త్రాలను కాపీ చేసుకొని తీసుకెళ్లినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. అలాగే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో ఉన్న సమాచారాన్ని కూడా కాపీ చేసుకొని వెళ్లారని పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆ సంస్థకు చెందిన న్యాయవాది.. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. సీఐడీ అధికారులు అభ్యంతరం చెప్పారు. ఏ అధికారంతో తనను ఆపుతున్నారని న్యాయవాది ప్రశ్నించడంతో లోనికి అనుమతించారు. సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న దస్త్రాలను దాదాపు 15 సంచుల్లో తీసుకొని వెళ్లిపోయారు. సంస్థకు చెందిన సీనియర్‌ పార్ట్‌నర్‌ కోటేశ్వరరావు వయోభారంతో సతమతమవుతున్నా.. మంగళవారం రాత్రి ఆయనను ఇంటికి వెళ్లేందుకు అనుమతించలేదు.

బ్రహ్మయ్య అండ్ కోలో సోదాలపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ఇవీ చదవండి

Last Updated : Mar 30, 2023, 11:17 AM IST

ABOUT THE AUTHOR

...view details