ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీబీఐకి ఇవ్వడమంటే కేసు అవసరం లేదనట్లే : తెలంగాణ ప్రభుత్వం - తెలంగాణ హైకోర్టు

MLAs Poaching Case : తెలంగాణలో ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రభుత్వం అప్పీలు చేసిన పిటిషన్​పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగించాలని సింగిల్ జడ్జి తీర్పును సవాల్​ చేస్తూ ప్రభుత్వం పిటిషన్​ దాఖలు చేసింది.

MLAs Poaching Case
తెలంగాణ హైకోర్టు

By

Published : Jan 4, 2023, 7:36 PM IST

MLAs Poaching Case Updates: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రభుత్వ అప్పీలుపై హైకోర్టు విచారణ చేపట్టింది. సీబీఐకి అప్పగించాలన్న సింగిల్ జడ్జి తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. సింగిల్ జడ్జి పలు విషయాలను పరిగణనలోకి తీసుకోలేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సింగిల్ జడ్జి పిటిషన్ పరిధి దాటి ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. సీబీఐకి ఇవ్వడానికి సీఎం కేసీఆర్ మీడియా సమావేశాన్ని కారణంగా చూపడం తగదని అన్నారు.

ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రపై సీఎం మాట్లాడారు: ఓ రాజకీయ పార్టీ నేతగా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రపై సీఎం కేసీఆర్ మాట్లాడారని హైకోర్టుకు వివరించారు. ఆయన ప్రెస్‌మీట్‌ను.. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నంగా చూడాలని చెప్పారు. ప్రభుత్వాలను అస్థిరపరిచే ప్రయత్నాలను దేశప్రజలకు తెలిపే ప్రయత్నంలోనే సీఎం ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఎఫ్‌ఐఆర్‌, పబ్లిక్ డొమైన్‌లో ఉన్న అంశాలపైనే ముఖ్యమంత్రి మాట్లాడారని వెల్లడించారు. కేసీఆర్ మాట్లాడినవి జాతీయ పార్టీని ఉద్దేశించిన రాజకీయ వ్యాఖ్యలని పేర్కొన్నారు.

కేసీఆర్ వ్యాఖ్యలతో దర్యాప్తునకు సంబంధం లేదు: మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలతో దర్యాప్తునకు సంబంధం లేదని న్యాయస్థానానికి తెలిపారు. సీఎంకు సీడీలు ఎలా చేరాయో మిస్టరీగా ఉందనేది సంబంధం లేని అంశమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వీడియోలను బహిరంగపరిచారు కాబట్టి.. సిట్ వల్ల ఉపయోగం లేదనడం ఊహాజనితమని వెల్లడించారు. ఆయనకు సీడీలు ఎలా చేరాయో న్యాయవాదులెవరూ వివరించలేదనడం పొరపాటు అని పేర్కొన్నారు.

సీఎం ప్రతివాదిగా లేరు: సీఎం ప్రతివాదిగా లేరు కాబట్టి.. ఆయన తరఫున ఎవరూ వాదించలేదని అన్నారు. పిటిషన్‌లో ప్రతివాదిగా లేని ముఖ్యమంత్రి వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవడం తగదని చెప్పారు. సిట్ ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు రద్దు చేయాలని.. పిటిషనర్లే కోరలేదని న్యాయస్థానానికి వివరించారు. సిట్ రద్దు చేయాలని పిటిషనర్లు కూడా కోరలేదని చెప్పారు. నిందితులకు దర్యాప్తు సంస్థలను ఎంచుకునే హక్కు ఉండదని తెలిపారు.

సీబీఐకి ఇవ్వడమంటే కేసు అవసరం లేదనట్లే: సిట్​పై ఆరోపణలు, అనుమానాలకు ఆధారాలేమిటో చూపలేదని హైకోర్టులో పేర్కొన్నారు. యూట్యూబ్‌లో వీడియోలను పరిగణలోకి తీసుకోవడం చట్టబద్ధం కాదని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నపార్టీ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేసిందనేది ఎఫ్‌ఐఆర్ సారాంశమని తెలిపారు. సీబీఐకి ఇవ్వడమంటే కేసు అవసరం లేదనట్లే అని పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆత్మవిశ్వాసం దెబ్బతీసేలా తీర్పు ఉందని పేర్కొన్నారు.

ఛార్జిషీట్ వేశాక సవాల్ చేసుకోవచ్చు:యూట్యూబ్‌లో వీడియోలు ఉండటం నిందితులకు నష్టమెలాగో వివరించలేదని అన్నారు. తీవ్రమైన అంశాలపై మీడియా విస్తృత ప్రచారం ఆశ్చర్యమేమి కాదని ధర్మాసనానికి వివరించారు. వీడియోలను మీడియా బయటపెట్టడం వల్ల నిందితులకు నష్టమనడం పొరపాటు అని తెలిపారు. చట్టానికి అనుగుణంగానే కేసును సిట్‌ దర్యాప్తు చేస్తుందని చెప్పారు. నిందితులకు అభ్యంతరముంటే ఛార్జిషీట్ వేశాక సవాల్ చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు.

అసలేం జరిగిదంటే:ఈ కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిట్‌ దర్యాప్తుపట్ల నమ్మకం లేదని బీజేపీ, నిందితులు రామచంద్ర భారతి, నందు కుమార్, సింహయాజి వేసిన పిటిషన్లు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు కేసును సీబీఐకి అప్పగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని సిట్‌ తరఫున అడ్వకేట్‌ జనరల్‌ న్యాయస్థానానికి తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో పురోగతి ఉన్నందున సిట్‌తో దర్యాప్తు చేయించాలని ఆయన కోరారు. అయితే, అడ్వకేట్‌ జనరల్‌ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తు వివరాలను సీబీఐకి అందజేయాలని సిట్‌ను హైకోర్టు ఆదేశించింది.

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఎమ్మెల్యేల వ్యవహారం:బీఆర్​ఎస్​కు చెందిన ఎమ్మెల్యేల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపీలో చేరాలంటూ తనతో పాటు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రేగా కాంతారావులను కొందరు ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ అక్టోబర్‌ 26న తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొయినాబాద్‌ పోలీసులు బేరసారాలకు జరుగుతున్న ఫాంహౌజ్‌పై దాడులు నిర్వహించారు. ఈ వ్యవహారంలో రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిలను అదే రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం: కేసు విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ నేతృత్యంలో ఏర్పాటైన సిట్‌.. న్యాయస్థానం అనుమతితో నిందితులను పలుమార్లు కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఈ క్రమంలోనే లభించిన ఆధారాలతో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్‌తో పాటు కేరళకు చెందిన తుషార్‌, జగ్గుస్వామిని విచారించేందుకు నోటీసులు జారీచేసింది. ఈ నేపథ్యంలో వారు హైకోర్టును ఆశ్రయించటంతో వీరికి ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన నోటీసులతో స్టే విధించింది.

సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు:ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న నందకుమార్, రామచంద్రభారతి, సింహయాజిలు బెయిల్‌ కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా పలు దఫాలుగా విచారణ జరిపిన న్యాయస్థానం 20 రోజుల క్రితం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు పట్ల నమ్మకం లేదంటూ ఈ కేసు నిందితులతో పాటు బీజేపీతో పాటు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారించిన ధర్మాసనం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details