Teachers Fires on Minister Adimulapu Suresh Controversial Comments:సెప్టెంబర్ 5 గురుపూజోత్సవం రోజున గురువుల కన్నా గూగుల్ మీన్నా అని అన్న ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యలపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. గురుపూజోత్సవం సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి.. గురువుల కన్నా గూగుల్ మీన్నా అనే వ్యాఖ్యలు చేశారు. మంత్రి వ్యాఖ్యలతో ఉపాధ్యాయ సంఘాలు(Teachers unions) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో లక్షలాదిమంది ఉపాధ్యాయులను మంత్రి అవమానించారని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలను నడుపుతున్న మంత్రి సురేష్ ఉపాధ్యాయులను అగౌరపరచడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5వ తేదీ వచ్చినా.. జీతాలు చెల్లించలేని ప్రభుత్వంసిగ్గుపడాల్సింది పోయి... ఉపాధ్యాయులను అవమానించడం విచారకరమని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల మనోభావాలను దెబ్బ తినే విధంగా మాట్లాడిన మంత్రి సురేష్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Adimulapu Suresh Controversial Comments On Teachers: మంత్రి వ్యాఖ్యలపై యుటియఫ్ నేతలు: ఏ సాంకేతికత కూడా ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం కాదనే కనీస ఆలోచన లేకుండా మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడటం దారుణమని యుటియఫ్(UTF) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్, అధ్యక్షులు వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యార్థి, ఉపాధ్యాయుల మధ్య నిరంతర భౌతిక సంబంధాలు ఉండటం ద్వారానే పరిపూర్ణ విద్యార్థిగా తయారు అవుతారని తెలిపారు. విద్యార్థికి నైతిక విలువలు, సామాజిక, శాస్త్రీయ దృక్పథంను పెంపొందించేది ఖచ్చితంగా ఉపాధ్యాయుల సాన్నిహిత్యం మాత్రమేనన్నారు. చదువు అంటే వ్యాపారం కాదని, రాష్ట్ర అవసరాలకు తగ్గ నూతన పౌరులను తయారు చేయడం లక్ష్యమనే విషయాన్ని మంత్రికి తెలియక పోవడం విచారకరమని అన్నారు. మంత్రి టెక్నాలజీ ద్వారా తయారయ్యారా? అని వారు ప్రశ్నించారు. మంత్రి ఆదిమూలపు తన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని, అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఉపాధ్యాయులకు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.