TDP Serious on Yerragondapalem incident: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా పర్యటనలో శుక్రవారం సాయంత్రం వైఎస్సార్సీపీ కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. గిద్దలూరు, మార్కాపురంలో తన పర్యటనను ముగించుకుని యర్రగొండపాలెం బయలుదేరినా చంద్రబాబును.. ఎలాగైనా అడ్డుకోవాలంటూ మంత్రి ఆదిమూలపు సురేష్.. వైసీపీ కార్యకర్తలను కోరడంతో దాదాపు 200 మంది రహదారి వెంట నిల్చొని ‘చంద్రబాబు గో బ్యాక్’ అంటూ ప్లకార్డులతో, నల్లజెండాలు, నల్ల బెలూన్లు చూపుతూ.. చంద్రబాబు ఉన్న వాహనంపై రాళ్ల దాడి చేశారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అడ్డుపెట్టి చంద్రబాబుకు రక్షణ కవచంలా నిలిచారు. ఈ క్రమంలో ఎన్‌ఎస్‌జీ కమాండెంట్ సంతోష్ కుమార్ తలకు గాయాలయ్యాయి.
కేంద్ర హెం శాఖ కార్యదర్శికి హైకోర్టు న్యాయవాది ఫిర్యాదు: ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబును లక్ష్యంగా చేసుకొని వైసీపీ నాయకులు చేసిన రాళ్లదాడిని ఆ పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాకు ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం చంద్రబాబు పట్ల పోలీసులు 151 సీఆర్పీసీని దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో తెలిపారు. వీఐపీ భద్రత కోసం ఉన్న పోలీసు స్టాండింగ్ ఆర్డర్లను ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదు చేశారు. సంఘ వ్యతిరేక వ్యక్తులతో పోలీసుల సానుభూతి వ్యవహారం పట్ల విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అజయ్‌కుమార్ భల్లాను గూడపాటి లక్ష్మీనారాయణ కోరారు.
టీడీపీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్..నిన్న యర్రగొండపాలెంలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై శనివారం టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లో చర్చించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే నిన్నటి ఘటన దృశ్యాలను గవర్నర్‌కు ఈ-మెయిల్‌ద్వారా పంపినట్టు సమాచారం. యర్రగొండపాలెం ఘటన వివరాలను రాజ్ భవన్‌తో పాటు డీజీపీ కార్యాలయానికి తెలుగుదేశం పంపింది.
ఆ మెయిల్‌లో.. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి రోజు నుంచి తెలుగుదేశం పార్టీపై జరిగిన ఘటనలను ప్రస్తావించింది. ముందుగా యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్‌లో దీనిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో పాటు ప్రకాశం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులకు జరుగుతున్న అన్యాయాలను, దళితులపై జరుగుతున్న దాడులను ఎలుగెత్తి చాటాలని పార్టీ నేతలకు అధిష్ఠానం దిశానిర్దేశం చేసింది.
ఈ కుట్ర సీఎం జగన్‌ది-ఐ-ప్యాక్‌దే..మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు వాహన శ్రేణీపై జరిగిన రాళ్ల దాడిపై టీడీపీ నాయకులు ఘాటుగా స్పందించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రెండు పేజీల లేఖను విడుదల చేశారు. ''ప్రతిపక్ష నేత చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడి ప్లాన్ సీఎం జగన్ రెడ్డిది, ఐ-ప్యాక్‌దే. రూట్ మ్యాప్ తెలుసుకుని మరీ దాడికి దిగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. జగన్ రెడ్డి సమావేశాల్లో ప్రతిపక్షాల నిరసనలకు పోలీసులు అనుమతిస్తారా..?. మంత్రి సురేష్ రౌడీ మూకల్ని ముందస్తు అరెస్టు ఎందుకు చేయలేదు..?. దళితుల్లో జగన్ రెడ్డిపై పెరుగుతున్న వ్యతిరేకతను మళ్లించాడినికే ఈ రాళ్ల దాడి కుట్ర. ఎన్ఎస్‌జీ కమాండోలను రెచ్చగొట్టి, దళితులపై కాల్పులు జరిపే కుట్ర చేశారు. కుట్ర, దాడులు, పోలీసు వైఫల్యాలపై గవర్నర్ చర్యలు తీసుకోవాలి. దాడి జరగబోతోందని ముందే డీజీపీ, జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేశాం. చంద్రబాబుపై రాళ్ల దాడి పోలీసులు, జగన్ రెడ్డి కలిసి కుట్ర చేశారు. జగన్ రోడ్డెక్కితే పరదాలు, కందకాలు, గృహ నిర్బంధాలు చేస్తారు. చంద్రబాబు పర్యటనపై దాడి జరగబోతోందని తెలిసినా కూడా ఎందుకు అడ్డుకోలేదు..?. కాన్వాయ్ రూట్ మ్యాప్ అందించి మరీ పోలీసులు దాడికి సహకరించారు. మంత్రి రోడ్డుపై చొక్కా విప్పి వీధి రౌడీలా వ్యవహరించారు.'' అని ఆయన మండిపడ్డారు.