TDP SENIOUR LEADER DHULIPALLA NARENDRA FIRE ON SEIMENS ISSUE: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం పేరుతో సీఐడీ అధికారులు సెలక్టివ్ ఇన్విస్టిగేషన్ చేస్తున్నారని.. తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ ఒప్పందంలో భాగమైన సీమెన్స్ కంపెనీపై.. ఎందుకు కేసు పెట్టలేదు? అని నిలదీశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే ముందు రాజకీయ వేధింపులను ఆపేసి, ఆ పని చేయాలని సూచించారు.
సీమెన్స్ సంస్థతో వైసీపీ ప్రభుత్వం కుమ్మక్కైంది: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి.. వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ.. సీమెన్స్ సంస్థతో ఏపీ ప్రభుత్వం కుమ్మక్కైందంటూ సంచలన ఆరోపణలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై సీమెన్స్ సంస్ధను వైసీపీ ప్రభుత్వం తప్పించి, ఎఫ్ఐఆర్‌లో పేరు చేర్చలేదని విమర్శలు గుప్పించారు. ఒప్పందంపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయించారా..? లేదా..? అని నిలదీశారు. ఆ వివరాలను ఎందుకు? బయటపెట్టం లేదని ప్రశ్నించారు.
ఈ కేసు వెనక ఏదో దురుద్దేశ్యం ఉంది..!: అనంతరం ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ ప్రకారం.. డిజైన్ టెక్ సంస్థ, డిజైన్ టెక్ ఎండీ మీద కేసులు పెట్టి, సీమెన్స్ సంస్థ మీద ఎందుకు కేసు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమెన్స్ సంస్థకు చెందిన సుమన్ బోస్ అనే వ్యక్తిని మాత్రమే బాధ్యుడిగా ఎందుకు చూపుతున్నారో..? సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నాటి తెలుగుదేశం ప్రభుత్వం సీమెన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందే తప్ప.. సుమన్ బోస్‌తో కాదని ధూళిపాళ్ల నరేంద్ర స్పష్టం చేశారు. సీమెన్స్ సంస్థను కేసులో పక్కన పెట్టడం వెనుక రాజకీయ దురుద్దేశ్యం స్పష్టంగా కన్పిస్తోందని ఆరోపించారు.
సీఎం జగన్‌కు దమ్ము, ధైర్యం ఉందా..?:సీమెన్స్ సంస్థ పేరు ఎఫ్ఐఆర్‌లో చేర్చే దమ్ము ప్రభుత్వానికి ఉందా? అని నిలదీశారు. ప్రజాధనం రాబట్టాలంటే సీమెన్స్ సంస్థను ముద్దాయిగా చేరిస్తే, వాస్తవాలు బయటకొస్తాయని హితవు పలికారు. సీమెన్స్ సంస్థ ఒప్పందంపై సీఎంమే రంగంలోకి దిగి దుష్ప్రచారం చేస్తోందని ధూళిపాళ్ల దుయ్యబట్టారు. సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలను చంద్రబాబే తెచ్చారనే అభూత కల్పనలు కల్పిస్తున్నారనీ.. గుజరాత్ వంటి రాష్ట్రాలు ఏపీ కంటే ముందుగా ఒప్పందం చేసుకున్నాయని గుర్తు చేశారు.