TDP Rythu Poru Mahasabha: ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని పరిటాలలో తెలుగుదేశం పార్టీ "రైతుపోరు మహాసభ" జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్, వైకాపా పాలన తీరుపై నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ రెడ్డి.. మూడేళ్లుగా రైతు వంచన పాలన సాగిస్తున్నాడని తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. జగన్ రెడ్డి రక్తంలోనే మోసం, నయవంచన ఉన్నాయని విమర్శించారు. "3 ఏళ్లలో లక్ష మూగజీవాలు చనిపోతే రూ.270కోట్ల పరిహారం ఎగ్గొట్టారు. జగన్ అన్న వదిలిన బాణం షర్మిల ఎక్కడుందో తెలీదు. కన్నతల్లిని నడిరోడ్డుమీద నిలబెట్టారు. నమ్మిన వాళ్లందరినీ నట్టేట ముంచిన జగన్ రెడ్డి.. విశ్వసనీయత గురించి మాట్లాడితే నవ్వొస్తుంది. 151సీట్లు జగన్ రెడ్డికి ప్రజలిచ్చినా.. తెలుగుదేశం పార్టీ అంటే భయమే. అందుకే వంశీ, బలరాం, వాసుపల్లి గణేష్, గిరిలను పార్టీలో చేర్చుకున్నారు. తెలుగుదేశం కార్యకర్తలపై పెట్టే ఒక్కో అక్రమ కేసు ఒక్కో వెంట్రుకతో సమానం అని జగన్ రెడ్డి గుర్తించాలి. రైతు భరోసా కేంద్రాలు వైకాపా నేతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అకౌంట్లలో డబ్బులేస్తానని జగన్ రెడ్డి అంటే.. ప్రజలు నమ్మే రోజులు పోయాయి" అని నరేంద్ర వ్యాఖ్యానించారు.
Bonda Uma on Rythu sabha: 3 ఏళ్లలో జగన్ రెడ్డి రాష్ట్రానికి ఒక్క మేలైనా చేశారని అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా ప్రశ్నించారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఎవరో రైతులెవ్వరికీ తెలీదన్నారు. మిల్లర్ల దగ్గర కమిషన్లు కొట్టేసిన కొడాలినాని.. రైతుల ధాన్యం డబ్బులు ఎగ్గొట్టాడని విమర్శించారు. రైతు సమస్యల పరిష్కారానికి వైకాపా ప్లీనరీలో ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్ల రద్దు తీర్మానం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మోటార్లకు మీటర్లు పెడితే విద్యుత్‌పై వచ్చే అన్ని సంక్షేమ పథకాలు రద్దవుతాయన్న ఆయన.. మీటర్లు ఎవరొచ్చి బిగిస్తారో వారిముందే వాటిని పగలకొడతామని హెచ్చరించారు.