TDP on Jayaho BC Sabha: తెలుగుదేశం బీసీల పార్టీ.. అందరి పార్టీ అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల తర్వాత జగన్కు బీసీలు గుర్తుకు వచ్చారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. బీసీలకు ఏ ముఖ్యమంత్రి చేయనంత ద్రోహం జగన్ చేశారని ఆరోపించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు తెలుగుదేశం కల్పించిన 34శాతం రిజర్వేషన్లు 24శాతానికి తగ్గించినందుకు వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సబ్ ప్లాన్ నిధులు మళ్లించడం బీసీలకు ద్రోహం చేయడం కాదా అని ప్రశ్నించారు. బీసీ నేతల్ని, కార్యకర్తల్ని చంపించిన జగన్ జయహో బీసీ సభ నిర్వహించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
బీసీల బతుకుల్ని సీఎం జగన్ చట్టబద్ధంగా నాశనం చేశారని తెలుగుదేశం నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. చంద్రబాబు రోడ్ షోకు వచ్చిన ప్రజా స్పందనను చూసిన తర్వాతే జగన్కు బీసీలు గుర్తుకు వచ్చారని ఎద్దేవా చేశారు. జగన్ అవలంభిస్తున్న బీసీ మోసపూరిత విధానాలను ప్రజలందరికీ తెలియజేస్తామంటూ కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద టీడీపీ నేతలు ధర్నా చేశారు. "ఇదేం ఖర్మ బీసీలకు" అంటూ నినాదాలు చేశారు.