TDP Minority Cell Rally In Nandigama: వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని మైనార్టీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ విమర్శించారు. నందిగామలో ఆదివారం రాత్రి టీడీపీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. నందిగామలోని స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమం మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముందు టీడీపీ కార్యకర్తలు నందిగామ వ్యాప్తంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయం నుంచి ప్రారంభించారు.
TDP MUSLIM LEADERS: 'సైదాపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి'
ర్యాలీ అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడిన శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్.. నాలుగేళ్ల జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ముస్లింలపై దాడులు, మైనార్టీలపై అక్రమ కేసులు పెట్టడం ఎక్కువయ్యాయి అని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ నాయకుల వేధింపులు భరించలేక కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారని షరీఫ్ ఆరోపించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి 2019లో విజయం సాధించినప్పటి నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఆయన పూర్తిగా మద్దతు ఇస్తున్నారని షరీఫ్ వ్యాఖ్యనించారు. ఎన్డీఏ ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా చట్టసభల్లో పెట్టిన బిల్లులకు జగన్ మద్దతు తెలిపారన్నారు. ప్రధానమంత్రి మోదీ, జగన్‌లది తండ్రి కొడుకుల సంబంధమని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ చేసిన వ్యాఖ్యాలను ఆయన ప్రజలకు గుర్తు చేశారు.
'ముస్లింలను అణగదొక్కేందుకు వైకాపా యత్నిస్తోంది'
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఉమ్మడి పౌరసత్వ బిల్లుపై ముస్లిం పెద్దలకు ఏ విషయం చెప్పలేదని షరీప్ ఆరోపించారు. ఈ బిల్లుపై ముస్లింలకు అనుకూలంగానే చంద్రబాబు మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని, లౌకిక వాదాన్ని టీడీపీ మాత్రమే కాపాడుతుందని ఆయన పేర్కొన్నారు. టీడీపీ తన 41ఏళ్ల ప్రస్తానంలో ముస్లింల సంక్షేమానికి చాలా కృషి చేసిందని షరీఫ్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ తమ ప్రభుత్వ హయాంలో ముస్లింల సంక్షేమానికి రూ. పది వేల కోట్లు ఖర్చు చేసిందని ఆయన పేర్కొన్నారు. కానీ వైఎస్సార్సీపీ తన బడ్జెట్‌లో ముస్లింల సంక్షేమానికి కేటాయించిన నిధులను నవరత్నాలకు మళ్లించి సీఎం జగన్ వారికి అన్యాయం చేస్తున్నారని షరీఫ్ ఆరోపించారు.
TDP Leader Remand: అర్ధరాత్రి కరెంటు తీసి.. మఫ్టీలో వచ్చి.. తలుపు తట్టి.. అన్వర్‌బాషాను పట్టుకెళ్లిన పోలీసులు
ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ముస్లింల హక్కులను కాపాడేందుకు టీడీపీ ముందుంటుందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు సీఎం కావటానికి సహకరించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో ముస్లింల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహ్మద్ ముస్తాక్ అహ్మద్, మాజీ పోలీసు హౌసింగ్ బోర్డు ఛైర్మన్ నాగుల్‌మీరా పాల్గొన్నారు.
ఈ ప్రభుత్వంలో మైనారిటీలపై దాడులు అధికమయ్యాయి: టీడీపీ మైనార్టీ నాయకులు