electricity tariff hike: పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వివిధ జిల్లాలోని టీడీపీ కార్యకర్తలు, నేతలు రోడ్డపైకి వచ్చి పెంచిన ఛార్జీలు తగ్గించాలంటూ ఆందోళన చేపట్టారు.
విజయవాడ: బొండా ఉమా ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బొండా మాట్లాడుతూ.. మద్యం, మైనింగ్, ఇసుక మాఫియా ద్వారా జగన్ వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు పన్నుల, ఛార్జీల భారాలతో ప్రజలను దోచేస్తున్నారని మండిపడ్డారు. నాడు బాదుడే బాదుడు అన్న జగన్.. నేడు ప్రజలను ఛార్జీల పెంపుతో, పన్నుల భారాలతో బాదేస్తున్నారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక 56 వేల కోట్లు భారం మోపారన్నారు. విద్యుత్ బిల్లుల పెంపులో జగన్ దారుణంగా వ్యవహరిస్తున్నారన్నారు. ట్రూ అప్ చార్జి అంటే అసలు బిల్లు ఇచ్చే వాళ్లకైనా తెలుసా అని ప్రశ్నించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సబ్ స్టేషన్లను ముట్టడిస్తామన్నారు.
కన్నా: జగన్ ఒక్క రోజు సీఎంగా ఉన్నా..రాష్ట్రానికి శాపమని తెలుగుదేశం నేత కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. జగన్ అవినీతి దాహం వల్లే, విద్యుత్ ఛార్జీల భారం పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కొనుగోళ్లల్లో కమిషన్ ద్వారా 6 వేల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. ఏయే శాఖల్లో ఎంత అప్పులు తెచ్చారు.. ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ జిల్లా: విద్యుత్ ఛార్జీల పెంపుపై తెలుగుదేశం భగ్గుమంది. ధరల పెంపును నిరసిస్తూ.. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో నేతలు ఆందోళన చేపట్టారు. భారం తగ్గించాలంటూ.. కొండపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద దేవినేని ఉమ ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నాకు దిగారు. 57 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపిన జగన్‌ను ఎందుకు నమ్మాలని నేతలు నిలదీశారు.
కర్నూలు జిల్లా: విద్యుత్ ఛార్జీలపై కర్నూలు జిల్లా మంత్రాలయంలో తెలుగుదేశం ఆందోళన నిర్వహించింది. విద్యుత్ సబ్ స్టేషన్ల ఎదుట ర్యాలీ నిర్వహించారు. ఛార్జీలు తగ్గించాలంటూ నెల్లూరులో టీడీపీ నేతలు.. విద్యుత్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ట్రూ ఆఫ్ చార్జీల పేరిట పేదల నడ్డి విరుస్తున్నారని అబ్దుల్ అజీజ్ మండిపడ్డారు. అనంతపురం జిల్లాలోని విద్యుత్ ఉపకేంద్రం ఎదుట మాజీ మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ధర్నా చేపట్టారు. ప్రజలపై భారం తగ్గించేవరకు పోరాడతామన్నారు.