Lokesh On Kethireddy : ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి 'చెప్పేవి నీతులు.. దోచేవి గుట్టలు' అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో నియోజకవర్గంలో తిరుగుతున్న కేతిరెడ్డి నిజాయితీగా ఉండాలంటూ నీతులు చెబుతారని.. తాను మాత్రం గుట్టలను దోచేస్తాడని మండిపడ్డారు. కేతిరెడ్డి ధర్మవరం సమీపంలోని ఎర్రగుట్టను ఆక్రమించి విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టుకున్నారని దుయ్యబట్టారు.
పాదయాత్రలో భాగంగా ధర్మవరం మండలంలో లోకేశ్ పర్యటించగా.. ధర్మవరం చెరువును ఆనుకొని ఆక్రమించిన ఎర్రగుట్టను చూసినట్లు ఆయన తెలిపారు. ఎర్రగుట్టలో అక్రమంగా నిర్మించిన ఫామ్ హౌస్ కనిపించగా.. ఆక్రమణ వివరాలు ఆరా తీయగా ఆయనకు విస్తుపోయే నిజాలు తెలిసినట్లు వెల్లడించారు. ధర్మవరం రెవెన్యూ పరిధిలోని 902 నుంచి 909 సర్వే నంబర్లలో.. ఎర్రగుట్టపై 15 ఎకరాల ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కాజేశారని వివరించారు. దొంగ పత్రాలు సృష్టించి ఆక్రమించినట్లు ఆరోపించారు.
15 ఎకరాల భూమి మాత్రమే కాకుండా మరో 5ఎకరాల భూమిని కేతిరెడ్డి.. తన కుటుంబంలోని ఓ మహిళ పేరుతో నమోదు చేసినట్లు తెలిపారు. ఆమెకు పిత్రార్జితంగా వచ్చినట్లు నమోదులో పేర్కొన్నట్లు వివరించారు. ఇలా మొత్తం ఆక్రమించిన 20 ఎకరాల భూమిలో కేతిరెడ్డి విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మించుకున్నట్లు లోకేశ్ ఆరోపించారు. జనం నిద్రలేవక ముందే హలో ధర్మవరం అంటూ.. సినీ నటులకు మించిన నటనతో కేతిరెడ్డి ప్రజలకు నీతులు చెప్తారని దుయ్యబట్టారు. సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసే కేతిరెడ్డి.. ఆక్రమణల నిజస్వరూపం చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. జగన్ రుషికొండ లాంటి స్థలాలను మింగేస్తుంటే.. కేతిరెడ్డి లాంటి వారు ఆయనను ఆదర్శంగా తీసుకుని ఆక్రమాలకు దిగుతున్నారని ఎద్దేవా చేశారు. దీనిని చూసిన తర్వాత ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనే సామెత గర్తుకు వచ్చిందని వాపోయారు.
ధర్మవరం నియోజకవర్గంలో యువగళం :లోకేశ్ పాదయాత్రరాప్తాడు నియోజకవర్గంలో పూర్తి చేసుకుని ధర్మవరం నియోజకవర్గంలోకి శనివారం ప్రవేశించింది. ఈ పాదయాత్రలో ఆయనకు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఆబాలగోపాలం నీరాజనాలు పలికారు. రాత్రి సమయంలో కూడా మహిళలు హారతులు ఇచ్చి ఆయన వెంట నడిచారు. ధర్మవరంలోని సీఎన్బీ పంక్షన్ హాల్ వద్ద రాత్రి బస చేసిన లోకేశ్.. ఆదివారం ఉదయం 58వ రోజు పాదయాత్ర పారంభించారు. ధర్మవరంలో చేనేత కార్మికులతో లోకేశ్ ఆత్మీయ సమావేశమయ్యారు. చేనేత మగ్గాలకు ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయాలని.. పట్టు పరిశ్రమ రైతులకు రాయితీలు ఇచ్చి ఆదుకుంటామని లోకేశ్ హామీ ఇచ్చారు. పట్టు వస్త్రాలపై జీఎస్‌టీ లేకుండా చేస్తామన్నారు. లోకేశ్ ఎదుట చేనేత కార్మికుడి భార్య రాములమ్మ కన్నీటి పర్యంతయ్యారు. అప్పులపాలై తాను భర్తను కోల్పోయానని ఆమె వాపోయింది. పిల్లలను పోషించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. పిల్లలను చదివించే బాధ్యత తాను తీసుకుంటానని రాములమ్మకు లోకేశ్ హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి :