Rammohan Naidu on Margadarsi: ప్రజల సొమ్ము దోచుకుని ఫేక్ కంపెనీలు పెట్టి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన సీఎం జగన్ రెడ్డి మార్గదర్శిపై అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటని పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి షెల్ కంపెనీల మాదిరి మార్గదర్శి రాత్రికి రాత్రి పుట్టొకొచ్చిన సంస్ధ కాదని తెలిపారు. 6 దశాబ్దాలకుపైగా డిపాజిట్‌దారుల విశ్వాసం చూరగొని అవినీతికి తావు లేకుండా ప్రయాణం సాగిస్తోందని పేర్కొన్నారు. షెల్ కంపెనీలు, ఫేక్ కంపెనీలే పెట్టి వేల కోట్ల అవినీతికి పాల్పడ్డ జగన్ రెడ్డికి మార్గదర్శి విలువ ఏం తెలుస్తుందని ప్రశ్నించారు.
న్యాయవాదులకు సీఐడీ నోటీసులు: జగన్ రెడ్డి కేవలం ఈనాడు పత్రికలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతున్నారన్న కక్షతోనే అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. పైగా దానిపై మాట్లాడిన న్యాయవాదులకు సీఐడీ నోటీసులు ఇస్తారా అని నిలదీశారు. రాష్ట్రం ఏమైనా జగన్ రెడ్డి తాత జాగీరా అని దుయ్యబట్టారు. ప్రజలెవరూ వైసీపీ ప్రభుత్వ అక్రమాల్ని, జగన్ రెడ్డి నియంతృత్వాన్ని ఖండించకూడదా అని ప్రశ్నించారు. చిట్ ఫండ్ యజమాని తన కమీషన్‌ను పెట్టుబడిగా పెట్టుకోవచ్చని 1982 చిట్ ఫండ్ చట్టమే చెబుతోందన్నారు. కేవలం కంపెనీ ఆర్జించే కమీషన్, ఇతర ఆదాయ నిల్వలను మ్యూచువల్ ఫండ్స్, షేర్లు మొదలైన వాటిలో పెట్టుబడులుగా పెట్టారని వెల్లడించారు. మార్గదర్శి చిట్ ఫండ్ రహిత వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారని చెప్పడం అర్ధరహితమన్నారు. జగన్ రెడ్డి అక్రమ కేసులు మార్గదర్శిని ఏం చేయలేవు, పాలన గాలికొదిలి అరాచక పాలన సాగిస్తున్న జగన్ రెడ్డికి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు.