TDP MLC Ashok Babu on CM Jagan Ten-Years Bail:వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ పదేళ్ల బెయిల్‌పై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. జైలులో ఉండాల్సిన జగన్ పదేళ్లుగా బెయిల్‌పై ఉన్నారంటూ.. ఎద్దేవా చేస్తున్నారు. జనంలో ఉండాల్సిన నిజాయతీపరుడు, తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం జైలులో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జైలులో ఉండాల్సిన జగన్.. జనంలో ఉండి ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ ప్రభుత్వం మున్ముందు ఎలా ముందుకెళ్లాలో.. తానే ఓ కొత్తదారి చూపించాడని, భవిష్యత్‌లో జగన్ రెడ్డితోపాటు అతని కేబినెట్ మొత్తం జైల్లో చిప్పకూడు తింటుందని ఆరోపించారు.
TDP MLC Ashok Babu Fires on YCP Ministers: స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ విషయంలో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న దుష్ప్రచారంపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ.. ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాలకులు రాజ్యాంగ వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
TDP MLC Ashok Babu Comments: ''వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. అవినీతి కేసుల్లో పదేళ్లు బెయిల్‌పై బయట ఉన్నజగన్ మోహన్ రెడ్డి.. ప్రజా సేవకుడైన చంద్రబాబును అన్యాయంగా జైలుకు పంపారు. తెలుగుదేశం ప్రభుత్వం మున్ముందు ఎలా ముందుకెళ్లాలో అతనే (జగన్) ఓ కొత్తదారి చూపించారు. భవిష్యత్తులో జగన్, ఆయన కేబినెట్ మొత్తం జైలుకెళ్లడం ఖాయం. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుపై జీవోలు ఇచ్చిన నీలం సాహ్ని, నిధులు విడుదల చేసిన ప్రేమచంద్రారెడ్డిని ఎందుకు విచారించలేదో మంత్రి బుగ్గన చెప్పాలి. బొత్స సత్యనారాయణ, ఇతర మంత్రులు, ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనలతో అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తున్నారు. పాలకులు రాజ్యాంగ వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తూ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు'' అని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు.