Yanamala Ramakrishnudu : రామరాజ్యం కంటే రాక్షస రాజ్యంపైనే జగన్‌కు మోజు ఎక్కువ అని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. అందుకే ఒంటిమిట్ట కళ్యాణానికి వెళ్లకుండా ఎగ్గొట్టారని శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల అన్నారు. జనం నమ్మట్లేదనే జగన్ మారీచ జిత్తులు మళ్లీ ప్రారంభించారని దుయ్యబట్టారు. దేశంలోనే ఇంత ఫెయిల్యూర్ సీఎం ఎక్కడా లేడన్న యనమల.. సొంత పార్టీలోనే అంతర్గత తిరుగుబాట్లతో దిక్కుతోచని స్థితి వైసీపీలో నెలకొందని మండిపడ్డారు. ‘జాబ్ కేలండర్‌కు పట్టిన గతే జగన్ వెల్ఫేర్ కేలండర్‌కు కూడా పడుతుందని ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వంపై బాధిత వర్గాలన్నీ తిరగబడుతున్నాయని అన్నారు. 4ఏళ్ల అరాచక, అప్రజాస్వామిక, నిరంకుశ పాలనపై ప్రజల్లో ఆగ్రహావేశాలను చూసే.. సొంతపార్టీ నాయకుల్లో, శ్రేణుల్లో సడలిన నమ్మకాన్ని పెంచేందుకే నానాపాట్లు పడుతున్నారని విమర్శించారు. ఏపీ పంజాబ్‌లా మారిందని సాక్షాత్తూ ప్రధాని మోదీనే అన్నారని గుర్తు చేశారు. ఐటీ రంగంలో ఏపీ వాటా కేవలం 0.2% మాత్రమేనని జాతీయ నివేదికలే వెల్లడించాయని.. ఉపాధి కల్పనకే కీలకమైన ఐటీలో జగన్ ఘోరంగా విఫలమయ్యారని ఆక్షేపించారు. ఎక్సైజ్ రాబడి ప్రభుత్వాదాయం కిందకు రాదనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.
మరోసారి జనాన్ని వంచించడానికి : కల్లబొల్లి కబుర్లు, పచ్చి అబద్ధాలతో మరోసారి జనాన్ని వంచించడానికి జగన్ సిద్ధమయ్యాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా ధ్వజమెత్తారు. సొంత తల్లిని, చెల్లిని రోడ్ల పాలు చేసిన ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలోని ఆడబిడ్డల్ని రక్షిస్తాడంటే ఎలా నమ్మాలని నిలదీశారు. సొంత పిన్ని పుస్తెలు తెంపి, బాబాయ్‌ని చంపిన వారితో తాడేపల్లిలో విందులు, వినోదాల్లో పాల్గొంటున్న జగన్.. ప్రజల్ని రక్షిస్తాడా అని ప్రశ్నించారు. మునిగిపోయేందుకు సిద్ధంగా ఉన్న నావ వైసీపీ అని ఆయన ఎద్దేవా చేశారు. అందుకే అందులోంచి ఎమ్మెల్యేలు దూకేస్తున్నారని అన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలు దిల్లీలో తాకట్టు : దేశంలోనే అబద్ధాన్ని నిజం చేసి అవాస్తవాలను నమ్మించే జగన్ రెడ్డి ఎత్తులు కుయుక్తులు ప్రజలందరికీ తెలుసని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. స్కాములు చేసి కేసుల్లో ఇరుక్కుని బయటపడడానికి రాష్ట్ర ప్రయోజనాలను దిల్లీలో ఏ విధంగా తాకట్టు పెట్టారో అది ప్రజలకు తెలుసని విమర్శించారు. స్కాములకు పెట్టింది పేరు జగన్ రెడ్డి అని.. స్కాములకు పుట్టినిల్లు వైసీపీ అంటూ ఎద్దేవా చేశారు.