PAWAN KALYAN MEETING WITH CHANDRABABU: టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కలవడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ భేటీపై అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తుండగా.. వైసీపీకి భయం పట్టుకుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇక డైపర్లు కొనుక్కోవాల్సిందే:టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ భేటీతో వైసీపీ నేతలకు ప్యాంట్లు తడుస్తున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎందుకైనా మంచిది ముందు జాగ్రత్తగా డైపర్లు వాడాలని ఎద్దేవా చేశారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ అడ్రస్ గల్లంతే :చంద్రబాబును పవన్ కలిస్తే మీరెందుకు ఉలిక్కిపడుతున్నారని మంత్రులపై మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. ఇద్దరూ కలిస్తే ఓడిపోతామన్న భయంతోనే మంత్రులు అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ విశాఖ పర్యటనలో ఇబ్బందులకు గురి చేసారన్న చినరాజప్ప.., ఆ రోజు చంద్రబాబు పవన్‌ను పలకరించాలని వెళ్లారని గుర్తుచేశారు. ఇప్పుడు కుప్పంలో ఆంక్షలు పెట్టి చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడంతో చంద్రబాబును పలకరించడానికి పవన్ వెళ్తే వైకాపా వారెందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. తెలుగుదేశం-జనసేన కలిస్తే వచ్చే ఎన్నికల్లో అడ్రస్ వుండదనే భయంతోనే నోటికొచ్చినట్టు మంత్రులు, వైకాపా నాయకులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్యాక్షనిజం పడగ నీడలో..:జగన్ రెడ్డి తన పీఠానికి బీటలు పారుతున్నాయన్న భయంతో ప్రతిపక్షాల గొంతు నొక్కడమే ఎజెండాగా జీవో నెం.1 తెచ్చారని తెదేపా ఎమ్మెల్యే డోలా బాల వీరాంజంనేయస్వామి ధ్వజమెత్తారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎమ్మెల్యేగా సొంత నియోజకవర్గంలో తిరగకుండా పోలీసులు అడ్డుకోవడం సరికాదని దుయ్యబట్టారు. జగన్ పెత్తందారులను మించి పోవడమే కాదు ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని బాల విమర్శించారు. ప్యాక్షనిజం పడగ నీడలో ఆంధ్రప్రదేశ్ విలవిలలాడుతోందని ఆక్షేపించారు. తెదేపా అధినేత చంద్రబాబు సభలకు వస్తున్న ప్రజాదరణ చూసి భయపడే జగన్ కందుకూరు, గుంటూరు ఘటనలను సాకుగా చూపి చంద్రబాబు జనంలోకి వెళ్లకుండా కుట్ర పన్నారని ఆరోపించారు. తమ తప్పులు ఎత్తి చూపే మీడియా, ప్రతిపక్షాలు ఉండకూడదన్న విధంగా ఆంక్షలు విధించే పాపకార్యానికి ప్రభుత్వం పూనుకుందని మండిపడ్డారు. ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ప్రభుత్వ అనాగరిక చర్యను తీవ్ర సమస్యగా గుర్తించి ఈ ధోరణిని అడ్డుకోక పోతే ప్రజాస్వామ్యం బతికిబట్ట కట్టదని హెచ్చరించారు.
ఇవీ చదవండి