TDP on Skill Development Issue: స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్‌పై నాలుగేళ్లుగా ఉత్తుత్తి ఆరోపణలతో కొండలు తవ్విన జగన్.. ఎలుక తోకను కూడా పట్టుకోలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. కట్టుకథలు, కల్లబొల్లి మాటలతో లేని అవినీతిని ఉన్నట్టు ప్రజల్నినమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని దుయ్యబట్టారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లో రాష్ట్రవాటా మొత్తం రూ.371 కోట్లు దారి మళ్లితే, ప్రాజెక్ట్ ఎలా అమల్లోకి వచ్చిందని నక్కా ఆనంద్ బాబు ప్రశ్నించారు. నైపుణ్య శిక్షణా కేంద్రాల్లో 2.94 లక్షల మంది ఎలా శిక్షణ పొందారని నిలదీశారు. 70 వేలమందికి ఉద్యోగాలు ఎలా వచ్చాయన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఒప్పందం నుంచి అమలు వరకు ప్రధాన పాత్ర పోషించిన ఐఏఎస్‌లను ఏపీ సీఐడీ ఎందుకు విచారించడం లేదని నక్కా ఆనంద్ బాబు ప్రశ్నించారు. ప్రేమచంద్రారెడ్డి, ఎస్.ఎస్.రావత్, ఉదయలక్ష్మి, లక్ష్మీనారాయణ వంటివాళ్లు ముఖ్యమంత్రికి ఎందుకు కనిపించలేని నక్కా ఆనంద్ మండిపడ్డారు. సీమెన్స్ సంస్థ తలుపు సీఐడీ ఇప్పటివరకు ఎందుకు తట్టలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో మతి భ్రమించే జగన్ నిన్న అసెంబ్లీలో 2గంటలపాటు కహానీలు వినిపించాడని ఆక్షేపించారు. 371కోట్లు టీడీపీ నేతల ఖాతాల్లోకి వెళ్తే, ఎప్పుడు వెళ్లాయో, ఎవరి నుంచి ఎవరి ద్వారా వెళ్లాయో వారంలో జగన్ బయటపెట్టాలని సవాల్ విసిరారు. షెల్ కంపెనీల సృష్టించి ప్రజల సొమ్ము కొట్టేసి, దాన్ని తిరిగి కంపెనీల్లోకి రాబట్టుకోవడం జగన్‌కు, అతని కుటుంబానికి అవినీతితో అబ్బిన విద్య అని నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు.
'లక్ష కోట్ల అవినీతి చేసి, 43 వేల కోట్ల అవినీతికి ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు సీబీఐ ఆరోపించింది. 16 నెలలు జైల్లో ఉన్నాడు. కేవలం చంద్రబాబును కేసులతో ఇబ్బందులకు గురి చేయాలనుకుంటున్నాడు. మెున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో వైసీపీ మీద పడిన ప్రభావాన్ని డైవర్ట్ చేయడానికే జగన్ ప్రయత్నిస్తున్నాడు.'- నక్కా ఆనంద్ బాబు, టీడీపీ నేత