TDP Leaders on Avinash Bail: జగన్ నాలుగేళ్ల పాలనలో ఫెయిల్ అయినా.. అవినాష్ రెడ్డిని కాపాడటంలో మాత్రం సక్సెస్ అయినట్లు కనిపిస్తుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమ, వర్ల రామయ్య మండిపడ్డారు. వివేకా సాక్ష్యాలను చెరిపివేసిన అవినాష్‌కు బెయిల్ ఇవ్వడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. మొన్నజగన్ దిల్లీవెళ్లి వ్యవస్థను మేనేజ్ చేసిన సీఎం జగన్‌కు కంగ్రాట్స్ చెప్పాలని ఎద్దేవా చేశారు. ఈ రోజు కోర్టులో వచ్చింది కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే అన్నారు. తిరుగులేని సాక్ష్యాలు ఈ కేసులో ఉన్నాయని చెప్పారు. కోర్టుల వ్యవహారం చూస్తే సామాన్యులకు ఒక న్యాయం.. ధనవంతుడుకి ఒక న్యాయం అన్నట్లు ఉందని వ్యాఖ్యానించారు. అవినాష్ రెడ్డి కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమీక్ష చేయాలని విజ్ఞప్తి చేశారు.
మహానాడు వేదికపై చంద్రబాబు తొలి విడత మేనిఫెస్టో ప్రకటించింది మొదలు.. ముఖ్యమంత్రి సహా, మంత్రులు, అధికార పార్టీ నాయకులకు నిద్రపట్టడం లేదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిధ్వజమెత్తారు. జగన్ చెప్పినవన్నీ అమలు చేశారంటున్న మంత్రులు.. ఆయన ప్రజలకు చెప్పకుండా చేసిన కొన్ని ఘనతల్ని మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ప్రజల్ని అడగకుండానే 8సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడని.. ఆర్టీసీ ఛార్జీలు, దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాడని మండిపడ్డారు.
ప్రకృతి సంపదైన ఇసుకను వేల కోట్లకు అమ్ముకుంటానని జగన్ మేనిఫెస్టోలో చెప్పాడా అని ప్రశ్నించారు. మద్యపాన నిషేధం అని చెప్పి చీప్ లిక్కర్ అమ్ముతూ ప్రజల ప్రాణాలు తీస్తానని చెప్పాడా అని నిలదీశారు. దేశమంతా డిజిటల్ ఇండియా అంటుంటే, మద్యం, ఇసుక అమ్మకాల్లో నగదు లావాదేవీలు జరుపుతూ, డబ్బుని కంటైనర్లలో తీసుకెళ్తున్నాడని ఆరోపించారు. 10లక్షల కోట్ల అప్పుతో అన్నపూర్ణగా పిలిచే ఆంధ్రప్రదేశ్‌ని.. అప్పులప్రదేశ్‌గా మార్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంట్రాక్టర్లకు దాదాపు 2లక్షల కోట్ల వరకు బకాయిలు పెండింగ్ పెట్టి వారి చావులకు కారణమవుతానని మేనిఫెస్టోలో జగన్ చెప్పాడా అని ప్రశ్నించారు. జనానికి చెప్పకుండానే ప్రత్యేక హోదా తెచ్చేశాడని.. ఉద్యోగుల అడక్కుండానే సీపీఎస్ రద్దు చేసేశాడని ఎద్దేవా చేశారు. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి యువతకు ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి ఈ 4ఏళ్లలో సాధించిన ఇలాంటి ఘనతల గురించి కూడా మంత్రులు ప్రజలకు చెప్పాలి కదా అని నిలదీశారు.
తమ నాయకుడు చంద్రబాబు.. జగన్మోహన్ రెడ్డిలాగా ఎవరికీ అన్యాయం చేయలేదని, ప్రజల్ని దుర్మార్గంగా వేధించి, వారిపై పన్నులు వేయలేదని సోమిరెడ్డి అన్నారు. తాను చెప్పిన అంశాల్లో ఒక్కటైనా తప్పు ఉందని మంత్రులు చెప్పగలరా అని సవాల్ విసిరారు. మంత్రులు మాట్లాడేటప్పుడు భాష అదుపులో ఉంటే మంచిదని హెచ్చరించారు.