TDP Leaders Complaint to Governor: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నశించాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. రాయలసీమ ప్రాంతంలో ముస్లిం మైనార్టీలపై జరిగిన దాడులు వివరిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాసిన లేఖను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు తెలుగుదేశం నేతలు అచ్చెన్నాయుడు, షరీఫ్, నక్కా ఆనంద్ బాబు, కొల్లు రవీంద్రలు అందజేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యంపై ఫిర్యాదు చేశారు.
అన్ని వర్గాల మీద ఎప్పుడూ లేని విధంగా జరిగిన దాడులను గవర్నర్‌కు నివేదించామని పార్టీ నేతలు తెలిపారు. ముఖ్యంగా ముస్లిం మైనార్టీల మీద జరిగిన ప్రతీ దాడి అంశమూ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని స్పష్టం చేశారు. లోకేశ్ యువగళం పాదయాత్ర చూసి ఓర్వలేక పోలీసుల సహకారంతో కలిగిస్తున్న ఇబ్బందులుపై కూడా ఫిర్యాదు చేసినట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు. పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక.. ఎలాగైనా ఆపించాలని కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాము ముందస్తు షెడ్యూల్ ఇస్తున్నా, పోటీగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండు రోజుల ముందే చంద్రబాబు కార్యక్రమం ఖరారు చేసుకుంటే.. ముస్లింలలో తన ప్రాబల్యం తగ్గిపోతోందని హడావిడిగా జగన్ హజ్ యాత్రికుల కార్యక్రమం పెట్టారని దుయ్యబట్టారు. తాము కూడా రేపటి నుంచి సైకో ముఖ్యమంత్రి దుశ్చర్యలు ఎండగడుతూ పోటీ బ్యానర్లకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. వైసీపీ పోటీ కార్యక్రమాలు అడ్డుకోని పోలీసులకు తమ బ్యానర్లను అడ్డుకునే హక్కు కూడా లేదన్నారు. లోకేశ్ పాదయాత్రకు తగినంత భద్రత కల్పించాలని గవర్నర్‌ని కోరినట్లు తెలిపారు. లోకేశ్‌కు ప్రాణహానీ కలిగించేలా వైసీపీ నేతలు, పోలీసులు కుమ్మకై వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వంతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని గవర్నర్ హామీ ఇచ్చారన్నారు. పోలీసుల అసమర్థత వల్లే రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలపై దాడులు పెరిగిపోతున్నాయని శాసన మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ మండిపడ్డారు. ముస్లిం మైనార్టీలపై వైసీపీ పాలనలో జరిగిన దాదాపు 70వరకూ కేసులు తాము చదివి వినిపిస్తే గవర్నర్ శ్రద్ధగా విన్నారన్నారు.
"నారా లోకేశ్ చేస్తున్న యువగళం పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడమే కాకుండా వైసీపీ రౌడీ మూకలను మా ర్యాలీల్లోకి పంపించి దాడులు కూడా చేయిస్తున్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. లోకేశ్ రాయలసీమలో పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి నిన్నటి వరకు ముస్లిం మైనార్టీలపై జరిగిన దాడులు సహా అన్ని అంశాలను ఈరోజు గవర్నర్‌కు వివరించాం"-అచ్చెన్నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు
రాష్ట్రంలో శాంతిభద్రతలు, మైనార్టీలపై జరుగుతున్న దాడులపై గవర్నర్‌కు ఫిర్యాదు