విజయవాడ రాణిగారితోటలో ఇటీవల వైసీపీ నేతల వేధింపులకు గురై మృతి చెందిన ముస్లీం మహిళ చోటి కుటుంబానికి తెలుగుదేశం నేతలు ఆర్థిక సాయం చేశారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్, టీడీపీ సీనియర్ నేత నాగుల్ మీరా లు బాధిత కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఇదే వివాదంలో వైసీపీ నేతల కుట్రలతో ఉద్యోగం కోల్పోయిన వడ్డెర సామాజిక వర్గానికి చెందిన కొమిరి దుర్గకు ప్రతినెల రూ.10వేలు చెల్లిస్తామని గతంలో హామీ ఇచ్చారు. ఆ ఆర్ధిక సాయాన్ని కూడా తెదేపా తూర్పు నియోజక వర్గం నాయకులంతా కలిసి వారి సొంత నిధుల నుంచి దుర్గకు రూ. 10 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన టీడీపీ నేతలు వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. అధికార పార్టీ నేతలు ప్రజల మధ్య పర్యటిస్తున్నప్పుడు ప్రజలు మరింత గట్టిగా సమస్యలు చెబుతుంటారు? ప్రజల సమస్యలు వినే ఓపిక కూడా లేని అవినాష్ ఏ విధంగా ప్రజా ప్రతినిధి అవ్వగలడు? అని నాగుల్ మీరా ప్రశ్నించారు. రౌడీయిజం, గుండాయిజం చేసే నాయకులను విజయవాడ తూర్పు ప్రజలు గెలిపించరని, అందుకే శాంతిభద్రతలు, ప్రశాంత వాతావరణం కల్పించే గద్దె రామమోహన్‌ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని నాగుల్ మీరా అన్నారు. ప్రజలకు తగిన విధంగా నాయకుడు ఉండాలే గాని, బెదిరింపులతో ప్రజలను ఏమార్చాలనుకోవడం వైకాపా నాయకుల అవివేకమని తెదేపా ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ లో గత 15 ఏళ్లుగా ఎటువంటి రౌడీయిజాలు లేవని, కొత్తగా గత 2 సంవత్సరాల నుంచి అసాంఘిక శక్తులు పేట్రేగిపోతున్నారని మండిపడ్డారు.