TDP Leaders Fires on YSRCP Government : పట్టుదల, స్వయం కృషితో రామోజీరావు ఎదిగారని.. విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆరు దశాబ్దాలుగా మచ్చలేని చరిత్ర కలిగిన మార్గదర్శిని రాజకీయ కక్షతో వేధించడం సరికాదంటూ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి పుట్టక ముందు నుంచే ఉన్న ఈ సంస్థ.. ఎలాంటి మచ్చ లేకుండా ముందుకు సాగుతున్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వ పాలనా తీరుపై "ఈనాడు, ఈటీవీ భారత్" వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తున్నందుకే.. మార్గదర్శిపై దాడులు జరుగుతున్నాయని అన్నారు.
కేంద్ర, రాష్ట్ర చట్టాలకు కట్టుబడే మార్గదర్శి పనిచేస్తోందని ఆలిండియా అసోసియేషన్ ఆఫ్ చిట్‌ఫండ్స్ చెబుతోందని తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం సమంజం కాదన్నారు. రామోజీరావు అనే అతిపెద్ద పర్వతంపై రాష్ట్ర ప్రభుత్వం రాళ్లు విసిరే ప్రయత్నం చేస్తోందని.. ఆ రాళ్లే తిరిగివచ్చి వారి ముఖంపై పడతాయని ఊహించడం లేదన్నారు. జరగబోయేది అదేనని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు.
వైసీపీకి పతనం మొదలైంది : అధికార వైసీపీ ప్రభుత్వానికి పతనం మొదలైందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కళ వెంకటరావు అన్నారు. రాజాం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీలో ప్రతి వ్యవస్థను భ్రష్టు పట్టించారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కనుమరుగైందన్నారు.