TDP Leaders Fires on Kesineni Nani:కేశినేని నాని జగన్ భేటీపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తిన్నింటి వాసాలు లెక్కపెట్టే, వ్యక్తిత్వం లేని వ్యక్తి కేశినేని నాని అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. చంద్రబాబు రెండుసార్లు ఎంపీ సీటిచ్చి గెలిపిస్తే, ఆయన్నే మోసగించాడని దుయ్యబట్టారు. కేశినేని భవనానికి అనుకుని ఉన్న నాగయ్య స్థలాన్ని కబ్జా చేద్దామని చూస్తే తప్పని చెప్పిన చంద్రబాబు శత్రువు అయ్యాడా అని నిలదీశారు. కేశినేని నానికి వ్యతిరేకంగా మాట్లాడమని చంద్రబాబు ఎప్పుడూ తనకు చెప్పలేదని తన కుటుంబసభ్యులపై ప్రమాణం చేసి చెప్తున్నానన్న బుద్దా వెంకన్న, చంద్రబాబు తనతో మాట్లాడించారని కేశినేని ఆయన కుమార్తెపై కనకదుర్గమ్మ సన్నిధిలో ప్రమాణం చేయగలడా అని ప్రశ్నించారు.
సీఎం జగన్‌ను కలిసిన ఎంపీ కేశినేని నాని - రాజకీయ వర్గాల్లో చర్చ
ఒకసారి కేశినేని నాని గురించి మాట్లాడానని తనను చంద్రబాబు మందలించారని కూడా తెలిపారు. రాజకీయ మనుగడ కోసం జగన్ని కలిసి చంద్రబాబుని విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేశినేని నాని వైసీపీ కోవర్ట్ అని ఇవాళ జగన్ కాళ్లు పట్టుకోవటంతో స్పష్టమైందని బుద్దా వెంకన్న అన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా 2లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని బీరాలు పలికిన వాడు ఇప్పుడెందుకు జగన్ని కలిశాడని నిలదీశారు. స్వతంత్ర అభ్యర్థిగా కేశినేని నాని పోటీ చేసి గెలిస్తే తన బుద్దా భవన్ కేశినేని నానికి రాసిస్తా, ఓడితే కేశినేని భవన్ ఇస్తావా అని సవాల్ విసిరారు. బీసీలు సంపాదిస్తే అక్రమార్జనా, కేశినేని నాని సంపాదిస్తే సక్రమార్జనా అని ప్రశ్నించారు. 90ల్లోనే దుర్గ గుడి మీద షాపుల కోసం 1.15 కోట్లు కట్టానని బుద్దా వెంకన్న తెలిపారు.