TDP Leader Somireddy on Shirdi Sai Electricals: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కడప ఎంపీ అవినాష్ రెడ్డి తన బినామీ కంపెనీ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ద్వారా భారీ దోపిడీకి తెరలేపారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు 78వేల కోట్ల రూపాయలు బాకీ ఉంటే, 29వేల కోట్ల రూపాయల స్మార్ట్ మీటర్ల టెండర్లు షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌కి అప్పగిస్తున్నారని ఆరోపించారు. తమ్ముడు కళ్లలో ఆనందం చూడటానికి.. ఏపీ ప్రజలు కోట్ల రూపాయల భారం మోయాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డీల్ మొత్తం కడపలోని షిర్డీ సాయి ఆఫీస్‌లోనే జరిగిందన్నది సుస్పష్టమని దుయ్యబట్టారు.
గూగుల్ టేక్ అవుట్ తీసుకుంటే అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో షిర్డీ సాయి కార్యాలయంలో సీఎండీ, అధికారులు సమావేశమై ధరలు నిర్ణయించారన్నది బయటకొస్తుందని సూచించారు. సీబీఐ విచారణ జరిపితే ట్రాన్స్ఫార్మర్స్ పెనాల్టీలు ఎంత మొత్తం షిర్డీ సాయి చెల్లించిందో తేలుతుందన్నారు. ఏ కంపెనీకి ఇవ్వని పెనాల్టీ రాయితీలు షిర్డీ సాయికి మాత్రమే ఎందుకిచ్చారని సోమిరెడ్డి నిలదీశారు. మరే కంపెనీ రాకుండా ట్రాన్స్ఫార్మర్స్ టెండర్లలో షిర్డీ సాయి మాత్రమే నాలుగు సంవత్సరాల నుంచి ఎలా దక్కించుకుంటుందో సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు.