ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Jawahar on Jagan Animutyalu: జగన్ పుట్టక ముందు నుంచే ఆ ప్రోత్సాహకాలున్నాయి: జవహర్‌

TDP leader Jawahar Fire on Jagananna Animutyalu program: 'జగనన్న ఆణిముత్యాలు' కార్యక్రమంపై మాజీ మంత్రి కే.ఎస్. జవహార్ ఘాటు వ్యాఖ్యలు. ఈ పథకాన్ని తానే కనిపెట్టానని సీఎం జగన్ చెప్పటం సిగ్గుచేటని ఆగ్రహించారు. 'ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలు' పేరుతో విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించామని తెలియజేస్తూ.. రెండు పేజీల లేఖ విడుదల చేశారు.

Jawahar
Jawahar

By

Published : Jun 21, 2023, 5:28 PM IST

TDP leader Jawahar Fire on Jagan Animutyalu program: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ.. పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థిని, విద్యార్థులకు జగన్ మోహన్ రెడ్డి పుట్టక ముందు నుంచే ప్రోత్సాహకాలు అందిస్తున్నారంటూ.. తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి కె.ఎస్‌. జవహర్‌ గుర్తు చేశారు. టీడీపీ హయాంలో 'ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలు' పేరుతో విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించామన్న ఆయన.. అబ్దుల్ కలాం పేరును తొలగించి 'జగనన్న ఆణిముత్యాలు' అని పెట్టడం ఆయన (అబ్దుల్ కలాం)ను అవమానించడమేనని జవహర్‌ మండిపడ్డారు.

టీడీపీ నేత జవహర్‌ లేఖ విడుదల.. 'జగనన్న ఆణిముత్యాలు' పేరుతో తాజాగా విజయవాడలో సీఎం జగన్.. పదో తరగతి, ఇంటర్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించి, నగదుతోపాటు అవార్డులను అందించారు. అంతేకాకుండా, పదో తరగతిలో ఫస్ట్‌ ర్యాంక్ వచ్చినవారికి లక్ష అని.. ద్వితీయ ర్యాంక్‌‌కు రూ.75, తృతీయ ర్యాంక్‌కు రూ.50 వేల ప్రొత్సాహం అందిస్తామని ప్రకటించారు. ఆ కార్యక్రమంపై మాజీ మంత్రి కె.ఎస్‌. జవహర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రెండు పేజీల లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో పలు కీలక విషయాలను ప్రస్తావించారు.

కె.ఎస్‌. జవహర్‌ లేఖలో ఏముందంటే.. ''ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ప్రోత్సాహకాలు జగన్ రెడ్డి పుట్టక ముందు నుంచే ఇస్తున్నారు. అలాంటిది ఆయనే ఈ పథకాన్ని కనిపెట్టినట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటు. టీడీపీ ప్రభుత్వం యువత, విద్యార్థుల్లో స్ఫూర్తిని కల్పించేందుకు 'ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలు' పేరుతో పెద్దఎత్తున ప్రోత్సహకాలు అందజేశారు. కానిజగన్ రెడ్డి జగనన్న ఆణిముత్యాలుగా మార్చి అబ్దుల్ కలాం పేరును తొలగించి అవమానించారు. 2019లోను జగన్ రెడ్డి 'అబ్దుల్ కలాం పురస్కారాల' పేరుతో అవార్డులు అందజేశారు. ఆ తర్వాత కలాం పేరును తొలగించి.. వైఎస్ఆర్ పురస్కారాలుగా మార్చింది. 2020, 2021లో కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. దీంతో పురస్కారాలు అందించలేదు. కానీ, గతేడాది పరీక్షలు నిర్వహించినా పురస్కారాలు అందించలేదు. ఈసారి వైఎస్ఆర్ పేరు తొలగించి, జగన్ రెడ్డి పేరు పెట్టుకొని విద్యార్థుల పథకాన్నీ రాజకీయం చేశారు'' అని ఆయన వివరించారు.

ఆ ఆత్మహత్యలకు జగనే కారణామా..?..అనంతరం జగన్ రెడ్డి హయాంలో పదో తరగతి ఫలితాలు సరాసరి 69.76 శాతంతో అత్యల్ప ఉత్తీర్ణత శాతం నమోదైందని.. జవహర్‌ దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో 92.90 శాతం మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. తన వల్లే విద్యార్ధులకు ప్రతిభ పురస్కారాలు అందుకుంటున్నారంటున్న జగన్ రెడ్డి.. మరి పది ఫలితాల్లో ఉత్తీర్ణులు కాక దాదాపు 30 మంది విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. ఆ ఆత్మహత్యలకు ఈ మేనమామే కారణమా అంటూ నిలదీశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే విద్యా వ్యవస్థ అస్థవ్యస్థంగా మారిందన్నారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ ఫలితాల మోడల్‌ స్కూళ్లో కడప జిల్లాదే చివరి స్థానమని అన్నారు. అన్ని సర్వేల నివేదికల్లోనూ విద్యా వ్యవస్థ నాశనం అయ్యిందనే చెబుతున్నాయని జవహర్‌ పేర్కొన్నారు.

దళిత ద్రోహి సీఎం జగన్.. మరోవైపు రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు, హత్యలు పెరగడంపై తెలుగుదేశం ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఎం.ఎస్ రాజు నేతృత్వంలో పార్టీ నేతలు నిరసన చేపట్టారు. గుంటూరు-విజయవాడ జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఇంకెంత మంది దళితుల ప్రాణాలు పోవాలంటూ బ్యానర్లు ప్రదర్శించారు. దళిత ద్రోహి సీఎం అంటూ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన చేపట్టారు. అనంతరం సీఎం దిష్టి బొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకుని.. నేతల్ని బలవంతంగా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details