TDP Jana Sena protest against the condition of roads:రోడ్లు దుస్థితిపై గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది పేరిట రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన నేతలు ఆందోళనలు చేపట్టారు. గుంతల రహదారులపై ర్యాలీలు చేసి వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రహదారులు పూర్తిగా ధ్వంసమవ్వడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని నేతలు ఆవేదన వ్యక్తంచేశారు.
అన్నమయ్య జిల్లా: రోడ్ల దుస్థితిపై అన్నమయ్య జిల్లా మదనపల్లిలో టీడీపీ, జనసేన నాయకులు ఆందోళనచేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే రమేష్ మండిపడ్డారు. కడపలోని ప్రధాన రహదారి ప్రకాష్ నగర్ నుంచి ఎర్రముక్కపల్లికి వెళ్లే రహదారి అధ్వానంగా ఉందంటూ నిరసన తెలిపారు. రోడ్లను బాగు చేయలేని సీఎం... రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారని నేతలు ప్రశ్నించారు.
అనంతపురం జిల్లా: ఉరవకొండ మండలం రాయంపల్లి రహదారి గుంతలమయంగా మారిందని... ఆందోళన చేశారు. వెంటనే రోడ్డు బాగుచేయాలని నాయకులు డిమాండ్ చేశారు. కణేకల్ మండలం కొత్తపల్లి రోడ్డును టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు పరిశీలించారు. కొత్తపల్లికి రోడ్డు వేయకపోగా... స్థానిక ఎమ్మెల్యే ఇదే రహదారి గుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీంతో రోడ్డు మరింత ఛిద్రంగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అడుగుకో గుంత, గజానికో గొయ్యి - ఈ రహ'దారుణాల' సంగతేంటి?: టీడీపీ, జనసేన ఆందోళన
పార్వతీపురం మన్యం జిల్లా: మక్కువ రహదారి దుస్థితిపై తెలుగుదేశం, జనసేన నాయకులు ఆందోళనకు దిగారు. తెలుగుదేశం హయాంలో నిర్మించిన రహదారులు తప్ప వైసీపీ పాలనలో రోడ్లు మరమ్మతులు చేసిన పాపాన పోలేదని నేతలు ఆరోపించారు. విజయనగరం జిల్లా రామభద్రపురంలో అధ్వానంగా ఉన్న రోడ్డుపై నిరసన తెలిపారు. రామభద్రపురం ప్రధాన కాలువ రహదారి పనులు ఎక్కడకక్కడే నిలిచిపోయాయని నేతలు మండిపడ్డారు. సమస్యలపై ప్రజలు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
అల్లూరి జిల్లా: పాడేరు మండలం బొక్కెళ్లు మార్గంలో ఆందోళన చేశారు. ద్విచక్ర వాహనాలతో భారీ ఎత్తున రహదారి మార్గం చూపిస్తూ నిరసన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి జంక్షన్ లో రోడ్డు గుంతలు వద్ద టీడీపీ, జనసేన నాయకులు ఆందోళన చేశారు. రోడ్లు ధ్వసమై వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారని నేతలు ఆవేదన వ్యక్తంచేశారు.