Telugu Desam Party fire on Minister Peddireddy: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు రెచ్చిపోయారు. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో విధ్వంసం సృష్టించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పర్యటనను అడ్డుకునేందుకు వాహనాలు అడ్డుపెట్టి, బీభత్సం సృష్టించారు. అంతేకాకుండా, టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బ్యానర్లను చించేసి.. ప్రతిపక్ష నేతలపై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో మదనపల్లె మండలం కొత్తపల్లి ఎంపీటీసీ దేవేంద్రతో పాటు మరికొంతమంది కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ఇరు పార్టీల కార్యకర్తలను నిలువరించేందుకు ప్రయత్నించారు. అయినప్పటీకీ వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడిని మాత్రం ఆపలేదు. దీంతో పోలీసులు రాళ్ల దాడి చేస్తున్న మూకలను నియంత్రించకుండా టీడీపీ కార్యకర్తలపై లాఠీఛార్జీ చేశారు.
అంగళ్లు ఘటనపై భగ్గమన్న టీడీపీ అధిష్ఠానం.. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం భగ్గుమంది. చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారంపై నిప్పులు చెరిగింది. వైఎస్సార్సీపీ శ్రేణుల పాపాలు, అరాచకాలు, విధ్వంసాలపై ఘాటుగా స్పందించింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి పర్యటనను అడ్డుకునేందుకు జగన్ ప్రభుత్వం ఎంతటి దారుణానికి, విధ్వంసానికి బరి తెగించిందో.. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైఎస్సార్సీపీ శ్రేణుల దాడిని.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, జీవీ ఆంజనేయులు,, బొండా ఉమా, యమమల రామకృష్ణుడు, కళా వెంకట్రావులతో పాటు పలువురు నాయకులు తీవ్రంగా ఖండించారు.
పెద్దిరెడ్డికి కుమిలి కుమిలి ఏడ్చే రోజు తెస్తాం..చిత్తూరు జిల్లా పుంగనూరు మంత్రి పెద్దిరెడ్డి పాపాలు పండే రోజు దగ్గర పడిందని.. టీడీపీ యువనేత నారా లోకేశ్ ధ్వజమెత్తారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేత చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు దాడులకు బరి తెగించావంటే, ఎంత అభద్రతలో ఉన్నావో అర్థం అవుతోందని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ గూండాలు రెచ్చిపోతుంటే.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం రాజారెడ్డి రాజ్యాంగమేనని లోకేశ్ ఆక్షేపించారు. తెలుగుదేశం సభపైకి వచ్చి వైసీపీ అల్లరి మూకలు రాళ్లు రువ్వుతుంటే, పోలీసులు టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇది పుంగనూరులో ప్రజాస్వామ్యంపై అధికార పార్టీ చేసిన దాడి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలు చిందించిన నెత్తురుపై ఒట్టేసి చెబుతున్నానన్న లోకేశ్.. పెద్దిరెడ్డీ చేసిన పాపాలన్నింటికీ కుమిలి కుమిలి ఏడ్చే రోజు తెస్తామని హెచ్చరించారు.
వైసీపీ మూకల విధ్వంసంపై అచ్చెన్నాయుడు ఆగ్రహం.. అన్నమయ్య జిల్లా అంగుళ్లులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అధికార పార్టీ కార్యకర్తలు చేసిన దాడి.. నియంతృత్వానికి పరాకాష్ట అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అభివర్ణించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి పర్యటనలను చూసి జగన్ రెడ్డి భయపడుతున్నారన్నారు. ప్రాజెక్టుల విధ్వంసం, పోరుబాట సక్సెస్ అవ్వడంతో అది భరించలేని వైసీపీ శ్రేణులు.. టీడీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూతపడే సమయం ఆసన్నమైందని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.