TDP Chief Chandrababu Fire on CM Jagan: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 1వ తేదీన ప్రారంభించిన 'సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి' పర్యటన ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కొనసాగుతోంది. ఇప్పటికే 7 రోజులు పూర్తి చేసుకున్న చంద్రబాబు పర్యటన.. నేటితో 8వ రోజుకు చేరుకుంది. ఈ 8వ రోజు పర్యటనలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ఉన్న ప్రాజెక్టులను సందర్శించిన చంద్రబాబు.. వాటి స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
పోలవరం నిర్వాసితులను మోసం చేసిన దుర్మార్గుడు జగన్..చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ''పోలవరం నిర్వాసితులను మోసం చేసిన దుర్మార్గుడు ఈ జగన్ మోహన్ రెడ్డి. నాలుగేళ్లలో ఏ ఒక్కరికీ పరిహారం అందకపోగా.. లబ్ధిదారుల జాబితాను మార్చి, అక్రమాలకు పాల్పడుతున్నారు. పట్టిసీమతో సమానంగా ఎకరానికి రూ.19 లక్షల పరిహారం ఇస్తామన్న హామీ ఏమైంది జగన్..?. పోలవరం నిర్వాసితులకు కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో తెలుగుదేశం పార్టీ వారికి (నిర్వాసితులకు) పునరావాసం కల్పించింది. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పరిధిలో ఈ జగన్ రెడ్డి కొత్తగా ఒక్క కట్టడమూ కూడా కట్టలేకపోయాడు. ఇంకా 214 కట్టడాలు కట్టాల్సి ఉండగా.. 50శాతం కనెక్టివిటీ పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు విశాఖ నగరానికి సుమారు 23 టీఎంసీల నీటిని సరఫరా చేయాలని మేము నిర్ణయిస్తే.. ఈ వైసీపీ సర్కార్ దానిని అటకెక్కించింది.'' అని ఆయన ధ్వజమెత్తారు.
ఏలేరు డెల్టా ఆధునికీకరణ పనులు ఆగిపోయాయి.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలేరు డెల్టా ఆధునికీకరణ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయని.. చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులు 5శాతం కూడా ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని ఆరోపించారు. గోదావరి ప్లడ్ బ్యాంక్స్ ఆయకట్టుకు జగన్ రెడ్డి ప్రభుత్వం రూ.7 కోట్ల ఖర్చును కూడా పెట్టలేకపోయిందని చంద్రబాబు దుయ్యబట్టారు. 2022లో గోదావరి ఫ్లడ్ బ్యాంకులను పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని చెప్పిన జలవనరుల శాఖ.. ఏడాది దాటినా కూడా దానిపై దృష్టి పెట్టలేదనిచంద్రబాబు మండిపడ్డారు.