TDP BC All Party Meeting in Vijayawada: బీసీల అభ్యున్నత్తే ప్రధాన అజెండాగా తమ ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందని తెలుగుదేశం, జనసేన నేతలు తేల్చిచెప్పారు. తమ ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరిచేందుకు బీసీలు ఇచ్చే విలువైన సూచనలు పరిగణనలోకి తీసుకుంటామని నేతలు స్పష్టం చేశారు. బీసీలను మళ్లీ మోసగించేందుకే సామాజిక బస్సు యాత్ర చేపట్టారని ధ్వజమెత్తారు.
రాష్ట్రాన్ని ఐదుగురు వ్యక్తులకు ధారాదత్తం చేశారు - సీఎం జగన్‌కు బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు బీసీలను ఓట్లు అడిగే నైతిక అర్హత కూడా వైసీపీ నేతలు కోల్పోయారని విమర్శించారు. బీసీల దమ్ము ఏంటో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ ముఖ్యమంత్రి జగన్‌కి తెలిసొచ్చేలా చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై విజయవాడలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
21 బీసీ కులాల భౌగోళిక పరిమితులు రద్దు - సీఎం జగన్ బీసీల ద్రోహి: అచ్చెన్నాయుడు
ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జనసేన నాయకులు పోతిన మహేష్, పలు బీసీల కుల సంఘాల నాయకులు హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీలపై జరుగుతున్న దాడులపై సమావేశంలో చర్చించారు. జగన్మోహన్ రెడ్డి ముమ్మాటికీ బీసీల ద్రోహి అని, బీసీలెవ్వరూ అతని వెంటలేరని దుయ్యబట్టారు. తన బీసీలు అనడానికి జగనెవ్వరని నిలదీశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి బీసీలు బుద్ధి చెబుతారని అన్నారు.
జగన్ ప్రభుత్వం బీసీలను చూసి ఓర్వలేదని నేతలు మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలు ఏ గట్టున ఉంటాయో, తాము అదే గట్టున ఉంటామని స్పష్టం చేశారు. బీసీల మీటింగ్‌కు సమావేశ మందిరం ఇవ్వకుండా ఫంక్షన్ హాల్ ఓనర్లను ప్రభుత్వం భయపెట్టిందని ఆరోపించారు. బీసీలపై తెలుగుదేశం - జనసేనలకు ఉన్నది కన్నతల్లి ప్రేమైతే, వైసీపీది సవతి తల్లి ప్రేమ అని ఎద్దేవా చేశారు.
స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు వైసీపీ ప్రభుత్వం తీసేయటం వల్ల 16 వేల 800పై చిలుకు బీసీలు రాజ్యాంగ పదవులు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 56 కార్పొరేషన్ల ద్వారా ఒక్కరికైనా సబ్సిడీ రుణం వచ్చిందా అని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో ఆర్ధికంగా ఎదిగిన ఒక్క బీసీ కూడా లేరని అన్నారు. బీసీలను మోసగించేందుకే వైసీపీ సామాజిక బస్సు యాత్ర చేస్తోందని అన్నారు.
ఎస్సీ వర్గీకరణపై జగన్ ఎందుకు నోరుమెదపట్లేదు? : మాజీమంత్రి జవహర్
మాయమాటలు చెబుతున్నారు: నా ఎస్సీలు , నా బీసీలు అంటున్న జగన్ ఏం చేశారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. దళితులు, బీసీలపై దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారని.. దాడులపై ఏ ఒక్క బీసీ మంత్రి అయినా స్పందించారా? అని నిలదీశారు. రాష్ట్రాన్ని ఐదుగురు వ్యక్తులకు ధారాదత్తం చేశారన్న అచ్చెన్న.. ఉత్తరాంధ్రకు వైవీ సుబ్బారెడ్డి, ఉభయగోదావరి జిల్లాలకు ఎంపీ మిథున్‌రెడ్డి, కృష్ణా, గుంటూరుకు అయోధ్యరామిరెడ్డి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ప్రభాకర్‌రెడ్డి, రాయలసీమ జిల్లాలకు సజ్జల రామకృష్ణారెడ్డిని సామంత రాజుగా చేశారని విమర్శించారు. బీసీలకు పదవులిచ్చామని మాయమాటలు చెబుతున్నారని అచ్చెన్న మండిపడ్డారు.
పేరుకు మాత్రమే సామాజిక న్యాయం ఉంది: తెలుగుదేశం - జనసేన అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సీపీఐ-సీపీఎం కూడా అసెంబ్లీలో ఉంటేనే ప్రశ్నించే గొంతుకలుండి అధికారపక్షం సక్రమంగా నడుస్తుందన్నారు. వైసీపీని నడిపే నలుగురు కీలక నేతలు జగన్ సామాజిక వర్గమే అని మండిపడ్డారు. రాష్ట్రంలో పేరుకు మాత్రమే సామాజిక న్యాయం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయాన్ని కొల్లగొట్టిన వీళ్లు సిగ్గులేకుండా సామాజిక సాధికార యాత్ర అంటున్నారని దుయ్యబట్టారు. కీలకమైన ఒక పోస్టయినా బీసీ, ఎస్సీలకు ఇచ్చి వారికి జగన్ విలువ ఇచ్చాడా అని ప్రశ్నించారు.
దళితులంతా 'వి హేట్ జగన్' అంటూ నినదిస్తున్నారు: వర్ల రామయ్య