Alliance between TDP and Janasena: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తుపై సందేహాలు ఒక్కొక్కటిగా తొలుగుతున్నాయి. రెండు నెలల క్రితం ప్రధాని మోదీతో పవన్ కల్యాణ్ భేటీ తర్వాత సందేహాలు తలెత్తినా, తాజాగా హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఇరు పార్టీల అధినేతల కలయిక.. పొత్తుపై స్పష్టమైన సంకేతాలిచ్చింది. ఇరువురు నేతల తాజా భేటీకి ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 సందర్భం అయినప్పటికీ భవిష్యత్తు బంధం బలోపేతం దిశగా ఇరుపార్టీలు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పరస్పర అవగాహన కుదుర్చుకునే దిశగా ఇద్దరు నేతల మధ్య మరిన్ని సమావేశాలు జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముందస్తు ఎన్నికల ప్రచారం దృష్ట్యా, ఇరు పార్టీలు సంయుక్తంగా చేపట్టే కార్యక్రమాలు.. మరింత వేగం పుంజుకోనున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కలిసి పనిచేయడమనే అంశంపైనే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల మధ్య ప్రధానంగా చర్చలు జరిగాయని తెలుస్తోంది. రెండు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఇప్పటికే కిందిస్థాయిలో కలిసి పనిచేస్తున్నారని, పొత్తుపై సానుకూల ధోరణి నెలకొన్నందున ఇరుపార్టీల నేతలు ఒక అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం.
ఓట్లు చీలకుండా: వైసీపీ అరాచకాల్ని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నీ కలవాలని పిలుపునిస్తున్న చంద్రబాబు.. రాజకీయ పార్టీలకు వ్యూహాలు ఉంటాయని, పొత్తులపై సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెబుతూవస్తున్నారు. వైసీపీ అకృత్యాలను అడ్డుకునేందుకు వెనకాడబోమని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోననని పవన్ కల్యాణ్ పదేపదే పునరుద్ఘాటిస్తున్నారు. వ్యతిరేక ఓటు చీలనివ్వకపోవడం, సమయానుకూలంగా నిర్ణయమంటే.. పొత్తు మినహా మరే మార్గమూ లేదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకు అనుగుణంగానే.. భవిష్యత్తులో కలిసి పనిచేస్తామని నిన్నటి భేటీ తర్వాత ఇరుపార్టీల నేతలూ ప్రకటించారు. రాజకీయాల్లో పొత్తులు సహజమన్న చంద్రబాబు, వాటిపై తర్వాత చర్చిస్తామని చెప్పారు. వైసీపీను ఎలా ఎదుర్కోవాలనే విషయమై భీజేపీ నేతలతోనూ మాట్లాడతానని పవన్ కల్యాణ్ చెప్పడంతో భవిష్యత్తులో టీడీపీ, జనసేనల మధ్య పొత్తు ఖాయమనే ఊహాగానాలకు మరింత ఊతమిస్తోంది. వైసీపీను సంయుక్తంగా, బలంగా ఎదుర్కొంటామని కూడా పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.