TDP Agitation Continues Against Chandrababu Arrest :కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గంలో టీడీపీ నేత బోడె ప్రసాద్ ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ గత మూడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పెనమలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆమరణ నిరాహార దీక్షను అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. అనంతరం బోడె ప్రసాద్‌ను అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో అరెస్టు చేసి.. ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
TDP Cadre Protest in AP :అనంతపురం జిల్లా తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు ఆధ్వర్యంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా సింగనమలలో నిరసన చేపట్టారు. రిలే నిరాహార దీక్ష శిబిరంలో సుమారు 20 నుంచి 30 మంది వరకు అర్థ శిరో మండనం చేయించుకున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఫ్లకార్డులు పట్టుకొని "సైకో పోవాలి సైకిల్ రావాలి" అంటూ నినాదాలు చేశారు. ఉరవకొండ పట్టణంలో టీడీపీ వడ్డేర్ల సాధికారక సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దీక్ష శిబిరం నుంచి టవర్ క్లాక్ వరకు భారీ ర్యాలీ చేశారు. చంద్రబాబు నాయుడును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గోవిందా నామాలతో నిరసన :చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ కర్నూలు జిల్లా ఆదోనిలో టీడీపీ శ్రేణులు వినూత్న నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో దీక్ష శిబిరం వద్ద టీడీపీ అభిమానులు అర గుండు చేసుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గోవిందా నామాలతో నిరసన చేశారు. చంద్రబాబుపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ నాయకులు ఆరోపించారు.
చంద్రబాబుకు సంఘీభావంగా ప్రొఫెషనల్ భారీ ర్యాలీ : టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు సంఘీభావాన్ని వ్యక్తం చేస్తూ చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రొఫెషనల్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బెంగళూరు, చెన్నై, విజయవాడ, హైదరాబాదు తదితర నగరాల్లో వృత్తిరీత్యా స్థిరపడిన కుప్పం ప్రాంతానికి చెందిన ఉద్యోగులు పెద్ద ఎత్తున సంఘీభావ ర్యాలీని చేపట్టారు, కుప్పంలోని చెరువు కట్ట వద్ద ప్రారంభమైన ర్యాలీ నేతాజీ రోడ్డు మీదుగా కొత్తపేట వరకు సాగింది, చంద్రబాబుకు మద్దతుగా, ఐటీ ఉద్యోగులు, వైద్యులు ఉపాధ్యాయులు ఇతర ఉద్యోగులు నినాదాలు చేశారు. చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ వైఎస్సార్ జిల్లా మైదుకూరులో చేపట్టిన రిలే దీక్షలు 19వ రోజుకు చేరుకున్నాయి. పార్టీ నియోజకవర్గ బాధ్యుడు పుట్టా సుధాకర్ యాదవ్ నాయకత్వంలో ఐటీడీపీ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు రిలే దీక్షలో పాల్గొన్నారు. చంద్రబాబు విడుదల చేసే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
18వ రోజు నిరసన దీక్ష :చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ గుంటూరు జిల్లా మంగళగరిలో టీడీపీ నాయకులు 18వ రోజు నిరసన దీక్షలు కొనసాగించారు. తెలుగు యువత ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేసిందని తెలియజేసేలా తెలుగు యువత నాయకులు తమ చేతులకు సంకెళ్లు వేసుకొని నిరసన తెలిపారు.