Talks with AP govt fail, power employees' strike from 10th: రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న వారందరూ విజయవాడలోని విద్యుత్ సౌధలో జరగబోయే మహా ధర్నాలో పాల్గొనాలని.. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ పిలుపునిచ్చింది. ఆగస్టు 9వ తేదీ అర్ధరాత్రి నుంచి విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారని వెల్లడించింది. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించటంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించింది. రివైజ్డ్ పే స్కేళ్లు, అలవెన్సులు, జీపీఎఫ్ వంటి అంశాలను పరిష్కరించకుండా ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని మండిపడింది. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆగస్టు 10వ తేదీన నిరవధిక సమ్మెకు దిగనున్నామని తెలియజేస్తూ.. గత నెల (జూలై 20న) ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కోల ఎండీలకు, డిస్కంల సీఎండీలకు విద్యుత్ ఉద్యోగుల ఐకాస నేతలు నోటిసు అందజేసినట్టు వెల్లడించింది.
Govt Request for Postpone of Strike: విద్యుత్ సంస్థల యాజమాన్యాలతో ఐకాస చర్చలు విఫలం.. విద్యుత్ ఉద్యోగులు ఇచ్చిన నోటీసుపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా నిరవధిక సమ్మెను వాయిదా వేసుకోవాలని సూచించింది. అంతేకాదు, విద్యుత్ ఉద్యోగుల నాయకులతో ఈరోజు చర్చలు జరిపింది. చర్చల్లో ఉద్యోగులు లేవనెత్తిన డిమాండ్లను పరిష్కారించేందుకు మరికొంత గడువు కావాలని ప్రభుత్వం కోరింది. ఇప్పటికే ప్రభుత్వానికి అనేకమార్లు గడువు ఇచ్చామన్న నాయకులు.. ఎట్టి పరిస్థితుల్లోను ఉద్యమం వాయిదా వేసుకోబోమని తేల్చి చెప్పారు. రేపటి నుంచి యథావిధిగా తమ ఉద్యమ కార్యాచరణను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రేపు పెన్ డౌన్, సెల్ డౌన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. విభాగాల వారీగా అధికారులకు సిమ్‌లు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. రేపు అర్ధరాత్రి నుంచి విద్యుత్ ఉద్యోగుల సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించారు.